నేను వీకే సింగ్ బాధితుడిని | Sakshi
Sakshi News home page

నేను వీకే సింగ్ బాధితుడిని

Published Fri, Aug 19 2016 9:42 AM

నేను వీకే సింగ్ బాధితుడిని

కేంద్ర మంత్రిపై ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ ఆరోపణ

న్యూఢిల్లీ: భారత ఆర్మీ మాజీ చీఫ్, కేంద్ర మంత్రి వీకే సింగ్‌పై ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు.  తన పదోన్నతిని ఉద్దేశపూర్వకంగా ఆయన అడ్డుకోవాలని చూశారని దల్బీర్ వెల్లడించారు. ఆర్మీ కమాండర్ ఎంపికలో పక్షపాతం చూపారని మాజీ లెఫ్టినెంట్ జనరల్ రవి దస్తానే సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిల్‌కు స్పందిస్తూ వ్యక్తిగత హోదాలో దల్బీల్ తన అఫిడవిట్‌లో ఈ ఆరోపణలు చేశారు. ‘‘ఆర్మీ కమాండర్‌గా నా పదోన్నతిని అడ్డుకోవాలనే ఏకైక లక్ష్యంతో  వీకే సింగ్ నన్నో బాధితుడిని చేయాలని చూశారు.

ఆధారాలులేని, ఊహాజనిత, తప్పుడు ఆరోపణలు చేస్తూ నాకు(2012 మే 19) షోకాజ్ నోటీసిచ్చారు’’ అని అఫిడవిట్‌లో దల్బీర్  పేర్కొన్నారు. ఏ తప్పులేదని విచారణలో తేలినా, దుర్బుద్ధితోనే తనకు నోటీస్ ఇచ్చారని విమర్శించారు. కాగా, 2011 డిసెంబర్ 20 రాత్రి అస్సాంలోని జొర్హాట్  ఆపరేషన్‌కు సంబంధించి విఫలమయ్యారనే కారణంతో జనరల్ ఆఫీసర్ కమాండింగ్‌గా ఉన్న దల్బీర్‌సింగ్‌పై  2012లో అప్పటి ఆర్మీ చీఫ్ వీకే సింగ్ క్రమశిక్షణ, నిఘా(డీవీ) బ్యాన్ విధించారు. ముందస్తు వ్యూహం ప్రకారమే తనపై డీవీ బ్యాన్, షోకాజ్ నోటీస్ ఇచ్చారని అఫిడవిట్‌లో జనరల్ దల్బీర్ పేర్కొన్నారు.

డీవీ బ్యాన్‌తో జీవోసీ-ఇన్-సీ ఈస్ట్రన్ కమాండ్ పదోన్నతి కోల్పోయానని చెప్పారు. జొర్హాట్ ఆపరేషన్ సమయంలో తాను వార్షిక సెలవులో ఉన్నానని స్పష్టంచేశారు. 2012 మే 31న వీకే సింగ్ రిటైరైన 15 రోజుల తర్వాత అప్పటి మేజర్ జనరల్ బిక్రమ్ సింగ్ తనపై ఉన్న డీవీ బ్యాన్‌ను సడలించడంతో జీవోసీ-ఇన్-సీ పదోన్నతికి అడ్డంకులు తొలగిపోయాయన్నారు. కాగా, ఆర్మీ కమాండర్‌గా పదోన్నతికి అర్హత ఉన్నా బిక్రమ్ సింగ్ తనను తిరస్కరించారని, దల్బీర్ సింగ్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని పిల్‌లో దస్తానే పేర్కొన్నారు. అయితే గతంలో సుప్రీం కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో దస్తానే విమర్శలను రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. అదే సమయంలో దల్బీర్ సింగ్‌పై డీవీ బ్యాన్ విషయంలో వీకే సింగ్ తీరును కూడా తప్పుబట్టింది.

Advertisement
 
Advertisement
 
Advertisement