
ముందున్నది యుద్ధమేనా?
సర్జికల్ దాడుల తర్వాత ఊపందుకుంటున్న ఊహాగానాలు
న్యూఢిల్లీ: పాక్‌పై భారత బలగాలు జరిపిన సర్జికల్ దాడుల తర్వాత ఎలాంటి పరిస్థితులు తలెత్తనున్నాయి.. యుద్ధానికి దారి తీస్తుందా.. లేదా.. ఒకవేళ యుద్ధం వస్తే భవిష్యత్తులో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి.. ఇలాంటి ప్రశ్నలు విశ్లేషకుల నుంచి సామాన్య ప్రజానీకాన్ని తొలిచేస్తున్నాయి. ఒకవేళ సుదీర్ఘ యుద్ధం జరిగితే మూడో యుద్ధం.. స్వల్పకాల యుద్ధం జరిగితే ఐదోది కానుంది. తొలిసారిగా 1947-48లో కశ్మీర్‌ను ఆక్రమించుకునేందుకు జిన్నా పటాన్ల ఆర్మీని భారత్‌పైకి పంపినపుడు యుద్ధం జరిగింది. దీని పర్యవసానంగా కశ్మీర్‌లోని కొంత భాగం ప్రస్తుత పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను పాక్ కైవసం చేసుకుంది. తిరిగి 1965లో కశ్మీర్‌ను ఆక్రమించుకోవాల్సిందిగా అయూబ్ ఖాన్‌ను అప్పటి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి భుట్టో పురికొల్పారు.
అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి లాహోర్ వైపు సరిహద్దు వెంబడి యుద్ధ ట్యాంకులను మోహరించారు. ఆ తర్వాత తాష్కెంట్ ఒప్పందంతో ఈ యుద్ధం అసంపూర్తిగానే ముగిసింది. ఎంతో ఖరీదుతో కూడుకున్న యుద్ధ విమానాల విడిభాగాల వ్యయం భరించలేక ఈ యుద్ధాన్ని ముగించాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. పాకిస్తాన్‌తో పోల్చుకుంటే భారత్ ఆర్థికంగా, శక్తిమంతంగా తయారైందనే చెప్పుకోవచ్చు. 1971 యుద్ధం తర్వాత పాక్‌నుంచి విడిపోయి బంగ్లాదేశ్ దేశంగా ఏర్పడింది. 1999లో కార్గిల్ యుద్ధం జరిగినప్పటికీ ఇరు దేశాలు దీన్ని యుద్ధంగా అధికారిక ప్రకటనలు చేయలేదు.
యుద్ధం జరిగే అవకాశాలూ లేకపోలేదు
ఉడీ ఘటన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ పాక్‌పై ప్రతీకార దాడి చేయాలని నిర్ణయం తీసుకోవడం.. సర్జికల్ దాడులు జరగడం చకాచకా జరిగిపోయాయి. అయితే సర్జికల్ దాడుల గురించి ప్రకటించే సమయంలో వాడే భాషలో కూడా భారత్ ఎంతో జాగ్రత్త తీసుకుంది. ఇంకా ముందుకు వెళ్లబోమని పాకిస్తాన్‌కు, ప్రపంచానికి హామీ ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే పాక్, భారత్ మధ్య ఇప్పటికే అనేక సార్లు యుద్ధాలు సంభవించిన నేపథ్యంలో మళ్లీ యుద్ధం జరిగే అవకాశాలు లేకపోలేదు.
సర్జికల్ దాడితో ఉగ్రవాదం సమసిపోతుందా...
పాక్‌పై జరిపిన సర్జికల్ దాడుల వల్ల పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం సమస్య సమసి పోతుందా.. లేదంటే మళ్లీ భారత్‌పై ఉగ్ర దాడి జరిగితే భారత్ తర్వాతి కర్తవ్యం ఏంటి? మరలా సర్జికల్ దాడి చేస్తుందా... అంతకన్నా పెద్ద నిర్ణయం తీసుకుంటుందా.. ఇప్పటికే బంగ్లాదేశ్‌ను పాక్ నుంచి విడదీసి సగం చేశాం. అయినా పాక్ గుణపాఠం నేర్చుకోలేదు. ఇంకా సగం విభజిస్తే కానీ పాకిస్తాన్ నేర్చుకుంటుందా? యుద్ధమే జరిగితే వేల ప్రాణాలు బలికావాల్సి ఉంటుంది.