తమిళనాడు (చెన్నై): నగరంలో ఆస్తి పన్ను బకాయి వసూళ్లలో చెన్నై కార్పొరేషన్ అధికారులు రోజుకో వినూత్న పంథాను అనుసరిస్తున్నారు. నోటీసులు ఇచ్చినా, దండోరా వేసినా స్పందించని స్టార్ హోటళ్ల యజమానుల్ని బెంబెళె త్తిస్తున్నారు.దండోరాతో పాటుగా హిజ్రాలతో నృత్యాలు చేయిస్తున్నారు.రాష్ట్ర రాజధాని నగరం చెన్నై కార్పొరేషన్ పరిధిలోని స్టార్ హోటళ్లు, మాల్స్‌లు, అనేక ప్రైవేటు సంస్థలు ఆస్తి పన్నుల చెల్లింపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వస్తున్నాయి. మొండి బకాయిదారులకు నోటీసులు ఇచ్చినా, దండోరా వేసినా స్పందించ లేదు. చివరకు పరువును మరింతగా బజారుకు లాగే రీతిలో హిజ్రాలతో స్టెప్పులు వేయించారు. ఈక్కాడు తాంగల్‌లోని ఓ హోటల్ ముందు హిజ్రాలతో నృత్యం చేయిస్తూ, దండోరా వేయడం ఆ యజమానుల్లో కలవారాన్ని రేపింది. ఆగమేఘాలపై అక్కడిక్కడే తాము చెల్లించాలని రూ. 30 లక్షలకు గాను చెక్కును అధికారులకు అందజేశారు. ఇదే బాటలో ఇతర యాజమాన్యాల భరతం పట్టే విధంగా కార్పొరేషన్ అధికారులు ముందుకు కదిలారు. శుక్రవారం ఒక్క రోజు కేవలం 13వ డివిజన్‌లో మాత్రం రూ. కోటి 63 లక్షలు ఆస్తి పన్ను వసూళ్లు కావడం గమనార్హం. అలాగే, కోయంబేడు, మదుర వాయిల్ పరిసరాల్లో నీటి పన్ను వసూళ్లు రూ. 33 లక్షలు రావడం విశేషం.అయితే, హిజ్రాల ద్వారా స్టెప్పులు వేయిస్తుండటం చర్చకు దారి తీసినా, ఎక్కడ వివాదాస్పదం అవుతుందోనన్నది వేచి చూడాల్సిందే.