
న్యూఢిల్లీ: జైషే మొహమ్మద్ వంటి ఉగ్రమూకలకు అండదండలు అందిస్తున్న పాకిస్తాన్‌పై భారత్ దౌత్య యుద్ధాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, జర్మనీ, జపాన్ సహా 25 దేశాల దౌత్యాధికారులకు పుల్వామా ఉగ్రదాడి జరిగిన తీరును భారత్ వివరించింది. ఉగ్రవాదాన్ని విదేశీ విధానంగా మలుచుకున్న పాక్ వ్యవహారశైలిని ఎండగట్టింది. ఢిల్లీలోని తన కార్యాలయానికి రావాల్సిందిగా పాక్ హైకమిషనర్ సోహైల్ మహమూద్‌కు భారత విదేశాంగ కార్యదర్శి సమన్లు జారీచేశారు. దాడిపై ఆయన తీవ్ర నిరసనను తెలియజేశారు. జైషేకు వ్యతిరేకంగా పాకిస్తాన్ సత్వరం, ఆమోదయోగ్యమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మసూద్‌కు చైనా మద్దతు
బీజింగ్: దాడికి పాల్పడిన జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌పై ప్రపంచ ఉగ్రవాదిగా ముద్ర వేయించడం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నానికి తాము మద్దతు తెలపబోమని చైనా వెల్లడించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ మాట్లాడారు. మసూద్ అజార్‌పై ‘పంచ ఉగ్రవాది’ ముద్ర వేసే విషయంలో చైనా వైఖరేంటని ప్రశ్నించగా, ‘ఐరాస భద్రతా మండలి నిర్దేశించిన నిబంధనల ప్రకారం నడుచుకుంటాం. జైషే మహ్మద్‌ను ఉగ్రవాద సంస్థగా ఇప్పటికే భద్రతా మండలి గుర్తించి ఆంక్షలు విధించింది’ అని చెప్పారు. మసూద్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు భద్రతా మండలిలో వీటో అధికారాలున్న చైనా అడ్డుతగులుతోంది.
Comments
Please login to add a commentAdd a comment