రాంచి/న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కారణంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులను స్వస్థలాలకు చేర్చే శ్రామిక్ రైళ్ల ప్రయాణం కార్మిక దినోత్సవమైన మేడే రోజు ప్రారంభమైంది. తొలి రైలు 1200 మంది కార్మికులతో శుక్రవారం తెల్లవారుజామున తెలంగాణ నుంచి జార్ఖండ్‌కు ప్రయాణమైంది. భౌతిక దూరం పాటించేందుకు వీలుగా ప్రతీ కోచ్‌లో 54 మందిని మాత్రమే అనుమతించారు. జార్ఖండ్‌లోని హతియాకు చేరుకున్నాక స్థానిక అధికారులు నిబంధనల ప్రకారం వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, అనంతరం స్వస్థలాలకు చేరుస్తారు. ఇళ్లల్లో కాని, ప్రత్యేక కేంద్రాల్లో కానీ వారిని క్వారంటైన్ చేస్తారు.
వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన కార్మికులను సొంత ప్రాంతాలకు చేర్చేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. కార్మికులను స్వస్థలాలకు చేర్చేందుకు ఈ రైలు కాకుండా శుక్రవారం మరో 5 శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేశారు. అవి నాసిక్(మహారాష్ట్ర)– లక్నో(యూపీ), అలువ(కేరళ)– భువనేశ్వర్(ఒడిశా), నాసిక్–భోపాల్(మధ్యప్రదేశ్), జైపూర్(రాజస్తాన్)– పట్నా(బిహార్), కోట(రాజస్తాన్)–హతియాకు కార్మికులను చేరుస్తాయి. ఈ ప్రత్యేక రైళ్లన్నీ మధ్యలో ఎక్కడా ఆగవని, ప్రయాణీకులకు రైళ్లలోనే భోజనం అందిస్తామని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment