
సాక్షి, పట్నా : ఉగ్రవాదులు మరోసారి దేశం మీద దాడికి తెగబడే అవకాశం ఉందని నిఘా వర్గాలు ప్రకటించాయి. ఈ దఫా దేశంలోని పురాతన ఆలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడే సూచనలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ సంస్థలు ప్రకటించాయి. ఈ దఫా పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ఉగ్రదాడికి తెగబడొచ్చని నిఘా వర్గాలు తెలిపాయి. లష్కరే తోయిబా ఉగ్రవాదులు బీహార్‌లోని అత్యంత పురాతన, ప్రతిష్టాత్మక ఆలయం అయిన మాతా తవవాలి ఆలయం మీద దాడి చేసేందుకు వ్యూహాలు పన్నుతున్నట్లు తెలిసింది. గోపాల్‌గంజ్ జిల్లాలోని ఈ ఆలయంలో దుర్గా మాత కొలువై ఉన్నారు. ఈ ఆలయాన్ని క్రీ.శ, 14వ శతాబ్దంలో చేర రాజులు నిర్మించారు.
లష్కరే తోయిబాకు చెందిన స్లీపర్ సెల్ ఉగ్రవాది.. షేక్ అబ్దుల్ నయీమ్ కొంత కాలంగా ఈ ప్రాంతంలో తచ్చాడుతున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. గోపాల్‌గంజ్ జల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే పలు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలు.. పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిసింది. ఇప్పటికే దుర్గామాత ఆలయానికి ప్రభుత్వం అదనపు భద్రతను కల్పించింది. ఈ ఆలయంలోని దుర్గామాతను దర్శించేందుకు బీహార్, జార్ఖండ్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, నేపాల్, పశ్చిమ బెంగాల్ నుంచి భారీగా భక్తులు వస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment