
కొత్తగా జాతి విద్వేషమా?
భారతదేశంలో అసహనం పెరగడానికి కుల మత విద్వేషాలే కారణమని మొన్నటి వరకు భావించాం. కానీ, బెంగళూరులో 21 ఏళ్ల ఓ టాంజానియా యువతిని వివస్త్రను చేసి విచక్షణారహితంగా చితకబాదడం గురించి వింటుంటే భారతీయుల అసహనం జాబితాలో జాతి విద్వేషం కూడా చేరిందనే విషయం అర్థమవుతోంది.
బెంగళూరు: భారతదేశంలో అసహనం పెరగడానికి కుల మత విద్వేషాలే కారణమని మొన్నటి వరకు భావించాం. కానీ, బెంగళూరులో 21 ఏళ్ల ఓ టాంజానియా యువతిని వివస్త్రను చేసి విచక్షణారహితంగా చితకబాదడం గురించి వింటుంటే భారతీయుల అసహనం జాబితాలో జాతి విద్వేషం కూడా చేరిందనే విషయం అర్థమవుతోంది. ఐటీ రంగంలో అమెరికాతో పోటీ పడుతున్న బెంగళూరు నగరాన్ని ఇండియా సిలికాన్ వ్యాలీ అని పిలుస్తుంటారు. ఇక ఇప్పుడు జాతి విద్వేషంలో కూడా పోటీ పడడాన్ని ఎలా అభివర్ణించాలో!
గంటకుముందు నగరంలో ఓ సూడానీస్ డ్రైవర్ చేసిన తప్పుకు స్థానికులు ఏ పాపం తెలియని టాంజానియా విద్యార్థిని దారుణంగా అవమానించి, శిక్షించడం భారతావనికే అవమానం. తనకు జరిగిన అన్యాయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేయబోతే, పోయి..రోడ్డు ప్రమాదానికి కారణమైన సూడానీ డ్రైవర్‌ను తీసుకొని రాపో! అంటూ పోలీసుల ఈసడించుకోవడం ఏ చట్టం నిర్వచించే అంశం. స్థానిక కాంగ్రెస్ నాయకుడు బీఎస్ శంకర్ సామూహిక ప్రజా దైర్జన్యాన్ని బహిరంగంగా సమర్థించడం ఏ విలువలకు కొలమానం?
కుల మతాల ప్రాతిపదికన ప్రజలే సామూహికంగా తీర్పు చెప్పే సంఘటనలు భారత్‌లో అప్పుడప్పుడైనా మనకు కనిపించేవే. జాతి పేరిట తీర్పు చెప్పడం జాతి నైచ్యంలో కొత్త ఒరవడిగా పేర్కొనవచ్చునేమో! గత రెండు, మూడేళ్లుగానే జాతి విద్వేష సంఘటనలూ అప్పుడప్పుడైనా భారత్‌లో కనిపిస్తున్నాయి. 2013లో గోవా అంతట నైజీరియన్లకు వ్యతిరేకంగా దాడులు జరిగాయి. నైజీరియాలో పనిచేస్తున్న భారతీయులకు వ్యతిరేకంగా కూడా తాము ఇలాంటి దాడులు చేస్తామని నైజీరియా దౌత్యవేత్తలు భారత్‌ను బెదిరించారంటే వాటి తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు.
2014లో ఢిల్లీ మెట్రో స్టేషన్లో ఇద్దరు ఆఫ్రికన్లపై జాతి వ్యతిరేకదాడులు జరిగాయి. ఆఫ్రికన్లను బానిసలుగా చేసుకొని బతికిన పాశ్చాత్య దేశాలకు వారిపై దాడులు చేసే సంస్కృతి ఉందిగానీ భారతీయులకు ఎప్పుడూ లేదు(కులాల పేరిట బానిసలు తప్ప)! నల్లవారిని ఆరితేరిన నావికులుగా, పోరాట యోధులుగా కీర్తించిన చరిత్ర భారతీయులది. అలాంటి ఘన చరిత్రను ఎవరు తప్పుదారి పట్టిస్తున్నారో, అందుకు బాధ్యులెవరో గుర్తించాల్సిన అవసరం ఉంది.
- ఓ సెక్యులరిస్ట్ కామెంట్