పోలవరం నిర్మాణాన్ని రాష్ట్రానికెలా ఇస్తారు?
ప్యాకేజీ కంటి తుడుపే: జైరాం రమేశ్
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బదిలీ చేయాలంటే ఏపీ పునర్విభజన చట్టానికి సవరణ చేయాల్సిందేనని, ఆ సవరణ ప్రతిపాదనను కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆప్తులైన కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడానికే పోలవరం నిర్మాణ బాధ్యతలను కేంద్రం రాష్ట్రానికి అప్పగిస్తోందని, దీని వల్ల ఓ టీడీపీ ఎంపీ లబ్ధిదారుడవుతారని ఆరోపించారు.
మాజీ ఎంపీ జేడీ శీలంతో కలిసి ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. కేంద్రమే పోలవరం ప్రాజెక్టును అమలు చేయాలని విభజన చట్టం స్పష్టంగా పేర్కొందని, అందువల్ల రాష్ట్రానికి పోలవరం అమలు బాధ్యతలను బదిలీ చేయాలంటే చట్టాన్ని సవరించాలని చెప్పారు. ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీతో ఒరిగేదేమీ లేదని, ఇది కంటితుడుపు చర్యగా జైరాం అభివర్ణించారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే ఏడాదికి రూ.60 వేల కోట్ల మేరకు లాభం ఉండేదని మాజీ ఎంపీ జేడీ శీలం చెప్పారు.