సాక్షి, న్యూఢిల్లీ : జార్ఖండ్‌లో నేరుగా ప్రజలకు రేషన్ సరకులను సరఫరా చేయడానికి బదులుగా నగదు బదిలీ చేయడం పట్ల 97 శాతం ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జార్ఖండ్‌లోని రాంచీ జిల్లా, నగ్రీ సమతి స్థాయిలో పైలెట్ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని గతేడాది అక్టోబర్‌లో ప్రవేశపెట్టింది. అప్పటి వరకు దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాలు నేరుగా రేషన్ షాపులకు వెళ్లి తమకు కావాల్సిన బియ్యాన్ని రూపాయికి కిలో చొప్పున తీసుకొని వచ్చేవి.
ఇప్పుడు ఆ కుటుంబాలు కేంద్రం నుంచి బ్యాంకులో డబ్బులు పడేవరకు నిరీక్షించాలి. బ్యాంకు వరకు వెళ్లి డబ్బులు వచ్చాయో, లేదో ముందుగా విచారించాలి. డబ్బులు వచ్చినా అంత తక్కువ డబ్బు లావాదేవీలను బ్యాంకులు తిరస్కరిస్తున్నాయి. దాంతో కుటుంబాలు ప్రజ్ఞా కేంద్రాలకు వెళ్లి డబ్బులు తీసుకోవాల్సి వస్తోంది. ఆ డబ్బులు తీసుకొని రేషన్ షాపులకు వెళ్లి కిలోకు 32 రూపాయలు చెల్లించి సరకులను కొనుగోలు చేయాల్సి వస్తోంది. జార్ఖండ్‌లో ఇంటి నుంచి బ్యాంకులు దాదాపు నాలుగున్నర కిలోమీటర్లు ఉండగా, బ్యాంకుల నుంచి ప్రజ్ఞా కేంద్రాలు 4.3 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో కాలి నడకన ఆ రెండు చోట్లకు వెళ్లి అక్కడి నుంచి రేషన్ దుకాణాలకు వెళ్లి సరకులు తీసుకోవడానికి ఒకరికి 12 గంటల సమయం పడుతుందని పేద కుటుంబాలు వాపోతున్నాయి.
ఊతకర్ర లేకుండా అడుగుకూడా వేయలేని జంత్రీదేవీ లాంటి వృద్ధులు ప్రతి నెలా కిలోమీటర్ల కొద్ది నడిచి రేషన్ సరకులు తెచ్చుకోవాలంటే చెప్పలేని గోసవుతోందని, దీనికి బదులు ఒక్కసారి ప్రాణం పోయినా బాగుండని వాపోతున్నారు. ఇక దౌరీదేవీ కాయకష్టం చేయడం వల్ల చేతి వేళ్లపై వేలిముద్రలు చెదిరి పోయాయని, ఆధార్ కార్డు వేలి ముద్రలతో పోలిక సరిపోక పోవడం వల్ల గత నాలుగు నెలలుగా ఆమెకు రేషన్ సరకులు ఇవ్వడం లేదట. రేషన్ సరకులు అందక ఒక్క జార్ఖండ్‌లోనే నలుగురు పిల్లలు మరణించిన విషయం తెల్సిందే. సమితి పరిధిలోని 13 గ్రామాల పరిధిలోని 244 కుటుంబాల అభిప్రాయలను విద్యార్థి వాలంటీర్లు సేకరించడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
కేంద్ర ప్రభుత్వం ఒక్క జార్ఖండ్‌లోనే అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పైలెట్ ప్రాజెక్టలని నిర్వహిస్తున్నాయి. రేషన్ సరుకులు అన్యాక్రాంతం కాకుండా నిరోధించేందుకే తాము నగదు బదిలీ పథకాన్ని తీసుకొచ్చామని, దీనివల్ల ఏకంగా 56 వేల కోట్ల రూపాయలు మిగిలాయని కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది. లబ్ధిదారులకే రేషన్ సరకులు అందక పోవడం వల్లనే ఈ నిధులు మిగిలాయన్నది వాస్తవం.
Comments
Please login to add a commentAdd a comment