
సాక్షి, చెన్నై: తాను రాజకీయాల్లోకి వచ్చేశానని, ఈ విషయమై ఇప్పటికే పలువురు నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నానని ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్పష్టం చేశారు. రాజకీయ రంగ ప్రవేశంపై కొన్నాళ్లుగా సాగుతున్న ఊహాగానాలకు ఆయన తెరదించుతూ.. ప్రజలతో అనుసంధానమయ్యేందుకు త్వరలో ఒక మొబైల్ యాప్‌ను కూడా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. 63వ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ ప్రవేశంపై కీలక ప్రకటన చేస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో మంగళవారం మీడియాతో కమల్ హాసన్ ప్రత్యేకంగా మాట్లాడారు.
పార్టీ ఏర్పాటుపై కమల్ స్పందిస్తూ.. ‘నేను ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చేశాను. మార్పు కోసం మీరు, నేను ఎన్నో ఏళ్లు ఎదురుచూశాం. అందువల్ల హడావుడి అవసరం లేదు. అందరూ చేస్తున్నట్లు మనం చేయడం లేదు. నిజాయితీగా ప్రయత్నిస్తున్నాం. ఇది చాలా ముఖ్యమైన రోజు. పురోగతి దిశగా ముందడుగుగా భావిస్తున్నా. కేవలం వ్యక్తిగత పురోగతే కాదు మొత్తం తమిళనాడు పురోగతి దిశగా ముందడుగు’ అని పేర్కొన్నారు.
ప్రజలకు చేరువయ్యే వేదిక ‘మయ్యం విజిల్’ యాప్
వెతుకు.. పరిష్కరించు ఇదే యాప్ ప్రధాన నినాదమని, ప్రజలకు చేరువయ్యేలా ఒక వేదికని కమల్ పేర్కొన్నారు. ‘మయ్యం విజిల్ యాప్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. జనవరిలో ప్రారంభిస్తాం. ప్రజలు తమ సమస్యలను, ప్రభుత్వంపై ఫిర్యాదులను యాప్‌లో నమోదు చేయవచ్చు. నేను తప్పు చేస్తున్నా ఎత్తిచూపవచ్చు.పారదర్శకంగా పరిష్కరించాల్సిన ఫిర్యాదుల్ని అప్పటికప్పుడు నా దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ యాప్ అనుసంధానంగా ఉంటుంది. యాప్‌ను ప్రారంభించాక అది ఎలా పనిచేస్తుందో అందరికీ తెలియచేస్తా. ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రకటనలు చేస్తాం’ అని వెల్లడించారు.
వివేకానంద, గాంధీజీలే ఆదర్శంగా..
మొబైల్ యాప్ ప్రారంభించాక తమిళనాడు వ్యాప్తంగా పర్యటిస్తానని కమల్ హాసన్ పేర్కొన్నారు. ‘ఇప్పటికే అనేకమందితో చర్చలు కొనసాగుతున్నాయి. రాజకీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో ప్రజలతో మమేకమయ్యేందుకు తమిళనాడు వ్యాప్తంగా పర్యటిస్తా. తమిళనాడు పర్యటనలో ప్రజలు నన్ను ఒక నటుడిగా కాకుండా వేరే దృష్టితో అర్థం చేసుకునేలా వివరిస్తాం’ అని చెప్పారు. యువతను ఉత్తేజితులను చేస్తూ సమాజంపై అవగాహన కోసం స్వామి వివేకానంద, మహాత్మాగాంధీ ప్రజల్లో తిరిగారని, వారిని ఆదర్శంగా తీసుకుని తాను కూడా రాష్ట్రంలో పర్యటిస్తానన్నారు.
హిందూ వ్యతిరేకి ముద్రవేస్తే అంగీకరించను
దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగిపోతుందని గతవారం ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘ఏ మతం హింసను బోధించదు. మతం పేరిట హింసను వ్యతిరేకించాను. ఉగ్రవాదం అనే పదం నేనెప్పుడూ వాడలేదు. హిందువుల్ని బాధించేలా నేను మాట్లాడను. ఎందుకంటే నేను ఆ కుటుంబం నుంచే వచ్చాను. ఆ భావాల నుంచి బయటకు వచ్చి లౌకికవాదిగా మారాను. అలాగని హిందూ వ్యతిరేకి, నాస్తికుడు అని ముద్రవేస్తే అంగీకరించను’అని కమల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment