
కర్ణాటక లోకాయుక్త రాజీనామా
కర్ణాటక లోకాయుక్త జస్టిస్ వై.భాస్కర రావు రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను గవర్నర్ తక్షణం ఆమోదించారు.
కర్ణాటక లోకాయుక్త జస్టిస్ వై.భాస్కర రావు రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను గవర్నర్ తక్షణం ఆమోదించారు. లోకాయుక్త కార్యాలయం నుంచి బెదిరించి డబ్బు వసూలుచేసే రాకెట్ ఒకటి నడుస్తోందంటూ గత కొంత కాలంగా ఆరోపణలు వస్తున్నాయి. జస్టిస్ భాస్కరరావు కుమారుడు అశ్విన్‌ను జూలై నెలలో ఇదే కేసులో అరెస్టు చేశారు. లోకాయుక్త కార్యాలయం నుంచి పొందిన సమాచారంతో బెదిరింపులకు పాల్పడటంతో అశ్విన్ అరెస్టయ్యాడు. లోకాయుక్త దాడులు జరగకుండా ఉండాలంటే లంచం ఇవ్వాలని అతడు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
అప్పటినుంచి జస్టిస్ భాస్కరరావు రాజీనామా చేయాలన్న డిమాండ్లు పలు వర్గాల నుంచి వినవస్తున్నాయి. మాజీ లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డే కూడా వాళ్లతో గొంతు కలిపారు. దీంతో జూలై చివరి వారం నుంచి లోకాయుక్త సెలవులో వెళ్లారు.
ఇక లోకాయుక్తను తొలగించే ప్రక్రియను సులభతరం చేస్తూ కర్ణాటక అసెంబ్లీ ఆ చట్టంలో సవరణలు తెచ్చింది. దాని ప్రకారం మూడోవంతు మంది సభ్యులు తీర్మానం మీద సంతకం చేస్తే చాలు.. లోకాయుక్తను తప్పించేయొచ్చు. ఈ విషయం తెలియడంతో.. ఇక వాళ్లు తప్పించేకంటే తాను తప్పుకొంటే మంచిదన్న ఉద్దేశంతో జస్టిస్ భాస్కరరావు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.