ప్రతీకాత్మక చిత్రం
దంపతులిద్దరూ పెద్ద ఉద్యోగాలు చేస్తారు, ధనవంతులు కూడా. కానీ సంతానమే లేదు. ఇక పిల్లలు పుట్టరని వైద్యులు తేల్చాక దత్తత తీసుకోవడమే మంచిదని భావించారు. శిశు సంక్షేమ శాఖ వద్ద నియమ నిబంధనలన్నీ పూర్తి చేసి చిన్నారి పాపను దత్తత తీసుకున్నారు. ఇలా రాష్ట్రంలో మగపిల్లల కంటే ఆడపిల్లలనే ఎక్కువమంది దంపతులు తమ బిడ్డగా చేసుకుంటున్నారు. మరో చేదు నిజం ఏమిటంటే వీధుల్లో, చెత్తకుప్పల్లో అనాథలుగా దర్శనమిస్తున్నవారిలో బాలికలు, ఆడశిశువులే అధికంగా ఉండడం గమనార్హం.
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో దంపతులు దత్తత తీసుకుంటున్న చిన్నారుల్లో ఎక్కువ మంది బాలికలే ఉంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2018– 19 ఏడాదికి సంబంధించి మొత్తం 237 మంది చిన్నారులను దత్తత తీసుకున్నారు. వారిలో 130 మంది బాలికలు, 107 మంది బాలురు ఉన్నారు. అంతేకాకుండా శిశుసంక్షేమ శాఖకు అప్పజెబుతున్న అనాథ పిల్లల్లో కూడా ఎక్కువ మంది బాలికలే ఉండటం గమనార్హం. దేశవ్యాప్తంగా 3,374 మందిని దత్తత తీసుకోగా అందులో 1,977 మంది బాలికలు, 1,397 మంది బాలురు ఉన్నారు. కాగా కర్ణాటకలో గత 2017 – 18లో 294 మంది శిశువులను, బాలలను దంపతులు దత్తత తీసుకోగా, మరుసటి ఏడాది 237 మందికి తగ్గింది. గతేడాది కంటే ఈసారి 19 శాతం తక్కువ దత్తతలు నమోదయ్యాయి.
దత్తతల్లో దేశంలో రెండవస్థానం
చిన్నారులను దత్తత తీసుకోవడంలో జాతీయస్థాయిలో కర్ణాటక రెండోస్థానంలో ఉంది. కాగా మహారాష్ట్ర 695 మందితో ప్రథమ స్థానం ఆక్రమించింది. ఆడపిల్లలైతే బుద్ధిగా చదువుకుంటారని, చెప్పినట్లు వింటారనే భావనతో ఎక్కువమంది దత్తత తీసుకొంటున్నారని తెలుస్తోంది. మలివయసులో తమ ఆలనాపాలనా చూస్తారని దత్త తల్లిదండ్రులు ఆశిస్తున్నారు. ఆస్తుల పంపకాల గొడవలు, కోపతాపాలు ఉండవనేది మరో కారణం.
అనాథల్లో బాలికలే ఎక్కువ
అనాథ ఆశ్రమాలకు, శిశు సంక్షేమ శాఖకు అప్పజెబుతున్న చిన్నారుల్లో ఎక్కువ మంది బాలికలే ఉన్నారు. రోడ్లపై దొరికే పిల్లల్లో.. బాల కార్మికులుగా పట్టుబడుతున్న వారిలో బాలికలే ఉండటం గమనార్హం. శిశు సంక్షేమ శాఖ అధికారులు రోడ్లపై, రైల్వేస్టేషన్‌లలో, బస్‌స్టేషన్‌లలో పనులు చేసుకుంటే తిరిగే వారిని గుర్తించి రక్షిస్తున్నారు. అంతేకాకుండా అప్పుడే పుట్టిన పిల్లలు చెత్తకుండీల పాలవుతున్నారు. వీరిలోనే ఆడ శిశువులే ఎక్కువగా ఉండటం దారుణమని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2016 నుంచి 2019 వరకు పోలీసుల ద్వారా శిశు మందిరాలకు సుమారు 576 మందిని అనాథ శిశువులను అప్పగించగా, వారిలో 478 మంది బాలికలు ఉన్నారు. అంతేకాకుండా ఆడపిల్ల పుట్టిందని కూడా కొందరు తల్లిదండ్రులు పోషించలేమంటూ శిశు మందిరాలకు అప్పజెబుతున్నారు. మరోవైపు ఆడపిల్లలైతే పెద్దయ్యాక ఆప్యాయత పంచుతారని ఆశిస్తూ ఎంతోమంది దత్త తల్లిదండ్రులు వారిని అక్కునచేర్చుకుంటున్నారు.
కర్ణాటకలో బాలబాలికల దత్తత వివరాలు
ఏడాది దత్తత
2018-19 237
2017-18 294
2016-17 252
2015-16 277
Comments
Please login to add a commentAdd a comment