కాంగ్రెస్‌లోకి టీఆర్‌ఎస్ విలీనంపై చర్చించడానికే ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖరరావు ఢిల్లీ వచ్చారని టీడీపీ సీమాంధ్ర ఎంపీలు ఆరోపించారు.
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లోకి టీఆర్‌ఎస్ విలీనంపై చర్చించడానికే ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖరరావు ఢిల్లీ వచ్చారని టీడీపీ సీమాంధ్ర ఎంపీలు ఆరోపించారు. ప్రజా సమస్యల ముసుగులో వైఎస్‌ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ నేతృత్వంలో ప్రతినిధి బృందం కూడా ఇక్కడకు వచ్చిందన్నారు. రాబోయే ఎన్నికల్లో సీట్లు పంచుకోడమే ఈ రెండు పార్టీల పని అని వారు ఆరోపించారు. పార్లమెంటు వెలుపల మంగళవారం టీడీపీ సీమాంధ్ర ఎంపీలు సీఎం రమేష్, కె.నారాయణరావు, మోదుగుల వేణుగోపాలరెడ్డి, నిమ్మల కిష్టప్ప మాట్లాడారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదని ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పినట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్న దానిపై వివరణ ఇవ్వాలని ప్రధాని కార్యాలయాన్ని డిమాండ్ చేశారు.
టీడీపీ ఎంపీల సస్పెన్షన్
రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ రెండో రోజు మంగళవారం కూడా రాజ్యసభలో టీడీపీ ఎంపీలు వై.ఎస్.చౌదరి, సి.ఎం.రమేష్ ఆందోళనకు దిగారు. పోడియం వద్దకు దూసుకొచ్చి సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించడంతో డిప్యూటీ చైర్మన్ పి.జె.కురియన్ వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు.