
అలనాటి ప్రఖ్యాత గాయకుడు కిషోర్ కుమార్
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఎమర్జెన్సీ’కి వ్యతిరేకంగా పోరాడిన వారిని ప్రశంసిస్తూ...వారికి కృతజ్ఞతలు తెలపడం కోసం మంగళవారం ముంబైలో ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 1975 నాటి రోజులను గుర్తు చేస్తూ ఎమర్జేన్సీ కాలంలో కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ కుటుంబం జయప్రకాశ్ నారాయణ్ , వాజ్‌పేయ్, అద్వాణీ వంటి ప్రముఖ నాయకులనే కాక మీడియాను కూడా తీవ్రంగా అణచి వేసిందని విమర్శించారు. ఎమర్జేన్సీని సాకుగా ఉపయోగించుకుని అలనాటి ప్రఖ్యాత గాయకుడు కిషోర్ కుమార్‌ను కూడా బ్లాక్ లిస్ట్‌లో చేర్చిందని మోదీ తెలిపారు.
ఈ విషయం గురించి ‘ఎమర్జేన్సీ కాలంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఒక ర్యాలీ కోసం కిషోర్ కుమార్‌ను పాట పాడమని కోరారు. కానీ ఆయన అందుకు అంగీకరించలేదు. అదే ఆయన చేసిన పెద్ద నేరం. దాంతో టీవీల్లో, రేడియోల్లో ఆయనను కనిపించకుండా, వినిపించకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేకాక ఆ సమయంలో ఆయన నేపధ్య గాయకుడిగా రూపొందించిన ‘ఆంధీ’(గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కిన పొలిటికల్ డ్రామా) చిత్రాన్ని విడుదల కాకుండా నిషేధించింది. ఇది ఆ పార్టీ మనస్తత్వం’ అంటూ మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.
1976 - 77 ఎమర్జేన్సీ కాలంలో సమాచార, ప్రసార శాఖ మంత్రిగా ఉన్న వీసీ శుక్లా కిషోర్ కుమార్‌ను బ్లాక్ లిస్ట్‌లో చేర్చారు. వీసీ శుక్లా అప్పట్లో ఇందిర గాంధీ చిన్న కొడుకు సంజయ్ గాంధీకి చాలా సన్నిహితంగా ఉండేవాడు.