క్యాబ్ సర్వీసులకు విశ్రాంతినిస్తున్నాం!
కోల్ కతా: మండే ఎండలతో ట్యాక్సీ సర్వీసులకు విశ్రాంతి ఇస్తున్నట్లు బెంగాల్ ట్యాక్సీ అసోసియేషన్ శనివారం ప్రకటించింది. ఉదయం 11గం.ల నుంచి సాయంత్రం 4.గం.ల వరకూ ట్యాక్సీ సర్వీసులను ఎట్టిపరిస్థితుల్లోనూ నడపలేమని స్పష్టం చేసింది. భానుడి ఉగ్రరూపంతో ఇప్పటికే ఇద్దరు క్యాబ్ డ్రైవర్లు మృత్యువాత పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు ట్రాన్స్ పోర్ట్ సెక్రటరీకి ట్యాక్సీ అసోసియేషన్ ఓ లేఖ రాసింది.
' ఎండ వేడిమి ఎక్కువగా ఉండే సమయంలో మేము ఏ క్యాబ్ ను కూడా రోడ్డుపై తిప్పలేం. ఒకవేళ ఎవరైనా తిప్పడానికి ప్రయత్నిస్తే అడ్డుకుంటాం. ఈ విషయాన్ని పోలీసులు, ప్రయాణికులు అర్ధం చేసుకోవాలి. సర్వీసులను నిలుపదల చేసే క్రమంలో పోలీసులు మాపై ఎటువంటి జరిమానా విధించొద్దు' అని ట్యాక్సీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బీమల్ గుహ విజ్ఞప్తి చేశాడు.
శుక్రవారం ఎండ తాపానికి తాళలేక నగరంలోని ఓ డ్రైవర్ ప్రాణాలు కోల్పోగా, ఈ రోజు జాదవ్ పూర్ ప్రాంతంలో శత్రుఘాన్ పొడ్డార్ అనే ట్యాక్సీ డ్రైవర్ సృహ తప్పిపడిపోయిన అనంతరం ఆస్పత్రితో చికిత్స పొందుతూ మృతి చెందాడు.