
గోవా కొత్త సీఎంగా పార్సేకర్ ప్రమాణం
పణజి: గోవా నూతన ముఖ్యమంత్రిగా ఆర్‌ఎస్‌ఎస్ మూలాలున్న లక్ష్మీకాంత్ పార్సేకర్ (58) శనివారం ప్రమాణస్వీకారం చేశారు. పణజిలోని రాజ్‌భవన్‌లో సాయంత్రం 4 గంటలకు జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన చేత గవర్నర్ మృదులా సిన్హా ప్రమాణం చేయించారు. అలాగే గత మనోహర్ పారికర్ ప్రభుత్వంలోని తొమ్మిది మంది మంత్రులు కూడా తిరిగి మంత్రులుగా ప్రమాణం చేశారు.
బీజేపీ నుంచి ఫ్రాన్సిస్ డిసౌజా, దయానంద్ మంద్రేకర్, రమేశ్ తవాడ్కర్, మహదేవ్ నాయక్, దిలీప్ పరులేకర్, మిలింద్ నాయక్, అలినా సాల్దన్హాలు మంత్రులుగా ప్రమాణం చేయగా ఆ పార్టీ మిత్రపక్షమైన మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ) నుంచి రామకృష్ణ అలియాస్ సుదిన్ ధావలికర్, దీపక్ ధావలికర్ లు మంత్రులుగా ప్రమాణం చేశారు.
సీఎం పార్సేకర్ మాంద్రెమ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకుముందు సీఎం పదవికి మనోహర్ పారికర్ రాజీనామా చేశారు. ఆపై బీజేపీ శాసనసభాపక్షం భేటీలో పార్సేకర్ పేరును ప్రతిపాదించగా దాన్ని ఫ్రాన్సిస్ డిసౌజా బలపరిచారు. ఇందుకు 21 మంది ఎమ్మెల్యేలంతా ఆమోదం తెలపడంతో బీజేపీఎల్పీ నేతగా పార్సేకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.