
మమతా బెనర్జీ సంచలన ప్రతిపాదన
కోల్‌కతా: ప్రధాని నరేంద్ర మోదీని వ్యతిరేకిస్తూ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ప్రతిపాదన చేశారు. ప్రధానిగా మోదీని తప్పించి దేశాన్ని కాపాడాలని బీజేపీని కోరారు. మోదీ స్థానంలో ఎల్‌కే అద్వానీ, రాజ్‌నాథ్ సింగ్ లేదా అరుణ్ జైట్లీ పగ్గాలు చేపట్టాలని సూచించారు.
ప్రధాని మోదీ పదవి నుంచి తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో మరో బీజేపీ నాయకుడి నాయకత్వంలో కేంద్రం ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరముందని ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న ప్రతికూల పరిస్థితులకు మోదీయే కారణమని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని మండిపడ్డారు.
పాత పెద్ద నోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకించిన మమతా బెనర్జీ... మోదీపై ఒంటరి పోరాటం చేస్తున్నారు. మోదీని ఢీకొనేందుకు జాతీయ స్థాయిలో విపక్షాలను కూడగట్టేందుకు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలను సీబీఐ అరెస్ట్ చేయడంతో మోదీపై తన పోరాటాన్ని ఉధృతం చేశారు. కక్షసాధింపు చర్యలో భాగంగా మోదీ తమ ఎంపీలను అరెస్ట్ చేయించారని మండిపడ్డారు.