వచ్చే లోక్‌సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలదే అత్యంత కీలకపాత్ర కానుందని తాజాగా నిర్వహించిన ఎన్నికల సర్వే ఫలితాలు జోస్యం చెప్తున్నాయి.
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలదే అత్యంత కీలకపాత్ర కానుందని తాజాగా నిర్వహించిన ఎన్నికల సర్వే ఫలితాలు జోస్యం చెప్తున్నాయి. అధికార యూపీఏ కానీ, ప్రతిపక్ష బీజేపీ కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సంఖ్యా బలం సాధించలేవని.. ఈ రెండు కూటములకూ వెలుపల ఉన్న వామపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీలే అత్యధిక స్థానాలు గెలుచుకుంటాయనేది సర్వే సారాంశం. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ దారుణంగా దెబ్బతింటుందని.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ గణనీయంగా బలం పుంజుకుంటుందని సర్వే చెప్తోంది.
ఆ ఫలితాల ప్రకారం.. 543 సీట్లున్న లోక్‌సభలో బీజేపీ, శివసేన, అకాలీదళ్, ఆర్‌పీఐ (అథవాలే), మేఘాలయ ఎన్‌సీపీ, హర్యానా జన్‌హిత్ కాంగ్రెస్‌లతో కూడిన ఎన్డీఏ 186 సీట్లు సాధిస్తుంది. అలాగే.. కాంగ్రెస్, ఎన్‌సీపీ, ఆర్‌ఎల్‌డీ, జేఎంఎం, ముస్లిం లీగ్, నేషనల్ కాన్ఫరెన్స్, కేరళ కాంగ్రెస్ (మణి)లతో కూడిన యూపీఏ కూటమి కేవలం 117 సీట్లకు మాత్రమే పరిమితమవుతుంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 240 సీట్లు గెలుచుకున్న ‘ఇతర పార్టీల’ పాత్ర అత్యంత కీలకం కానుంది. ఈ విభాగంలో ప్రధానంగా వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలైన బీఎస్‌పీ, ఎస్‌పీ, అన్నాడీఎంకే, తృణమూల్, వైఎస్సార్‌కాంగ్రెస్, టీఆర్‌ఎస్, ఆర్‌జేడీ, బీజేడీ వంటి పార్టీలు ఉన్నాయి.