‘బిల్లు’పై ప్రసారాలు బంద్
-
చర్చ మొదలవగానే టీవీ చానళ్లలో నిలిచిపోయిన ప్రత్యక్ష ప్రసారాలు
-
తొలుత ‘సభ వాయిదా’ అంటూ లోక్‌సభ టీవీ ప్రకటన
-
ఆ తర్వాత ‘కాసేపట్లో ప్రత్యక్ష ప్రసారాలు’ అనే సూచన
-
ఓటింగ్, చర్చ ముగిసి 90 నిమిషాల తర్వాత సభ వాయిదా
-
అయినా పునఃప్రారంభం కాని సభ ప్రత్యక్ష ప్రసారాలు
-
సాంకేతిక లోపం కారణమన్న లోక్‌సభ టీవీ సీఈవో
-
అది ‘వ్యూహాత్మక లోపం’ అంటూ సుష్మాస్వరాజ్ ధ్వజం
-
ప్రసారాల నిలిపివేతను తప్పుపట్టిన పలు పార్టీలు
న్యూఢిల్లీ: వివాదాస్పద తెలంగాణ బిల్లును లోక్‌సభలో ఆమోదించటానికి సంబంధించిన కీలకమైన 90 నిమిషాల సభా కార్యక్రమాలు టీవీ చానళ్లలో ప్రత్యక్ష ప్రసారం కాలేదు. లోక్‌సభ టీవీకి ప్రత్యక్ష ప్రసారాలు నిలిచిపోవటంతో ఏ చానల్‌లోనూ సభా కార్యక్రమాలు ప్రసారం కాలేదు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు లోక్‌సభ తిరిగి సమావేశమయ్యాక కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే మాట్లాడటం ప్రారంభించగానే ప్రత్యక్ష ప్రసారాలు నిలిచిపోయాయి. సభా కార్యక్రమాలన్నిటినీ ప్రత్యక్ష ప్రసారం చేసే లోక్‌సభ టీవీ.. ‘సభ వాయిదా పడింది’ అనే సూచనను ప్రదర్శించింది. కానీ.. వాస్తవానికి సభలో కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొంతసేపటి తర్వాత.. లోక్‌సభ టీవీలో ‘కాసేపట్లో లోక్‌సభ నుంచి ప్రత్యక్ష ప్రసారం’ అనే సూచన వచ్చింది. అయితే.. బిల్లును ఆమోదించి, 90 నిమిషాల పాటు కార్యక్రమాలు కొనసాగి.. సభ వాయిదా పడిందే కానీ.. ప్రత్యక్ష ప్రసారాలు పునఃప్రారంభం కాలేదు.
50వ గది నుంచి సిగ్నల్స్ అందలేదు: టీవీ సీఈఓ
అయితే.. లోక్‌సభ టీవీ చానల్‌కు ప్రత్యక్ష ప్రసారాలను అందించే పార్లమెంటు భవనంలోని 50వ నంబరు గదిలో సంభవించిన సాంకేతిక లోపం కారణంగా ప్రత్యక్ష ప్రసారాలు నిలిచిపోయాయని ఆ చానల్ సీఈఓ రాజీవ్‌మిశ్రా ఆ తర్వాత పేర్కొన్నారు. సభ తిరిగి సమావేశమయ్యాక ఒక నిమిషం పాటు ప్రసారం చేసిన తర్వాత.. ఆ గది నుంచి సిగ్నల్స్ అందలేదని.. దీంతో తాము ఫీలర్లను ప్రసారం చేయాల్సి వచ్చిందని ఆయన పీటీఐ వార్తా సంస్థతో చెప్పారు. ‘‘అక్కడ సాంకేతిక సమస్య తలెత్తింది.. ఇక ప్రసారాలను నిలిపివేయటం మినహా మాకు ప్రత్యామ్నాయం లేకుండా పోయింది’’ అని తెలిపారు. సాంకేతిక లోపం తలెత్తిన తర్వాత తాను సాంకేతిక సిబ్బందితో అత్యవసర సమావేశం నిర్వహించానని, దీనిపై బుధవారం నాటికి తనకు నివేదిక అందుతుందని చెప్పారు.
ప్రెస్ గ్యాలరీ నిండా మీడియా ఉంది: లోక్‌సభ సచివాలయం
బిల్లు ఆమోదాన్ని ప్రజలు ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించలేకపోవటం దురదృష్టకరమని లోక్‌సభ సచివాలయం ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది. ‘‘ఈ రోజు (మంగళవారం) లోక్‌సభ మధ్యాహ్నం 3:00 గంటలకు సమావేశమైన తర్వాత.. సభా కార్యక్రమాలను సాంకేతిక సమస్యల కారణంగా లోక్‌సభ టీవీ ద్వారా ప్రత్యక్షంగా ప్రసారం చేయటం సాధ్యంకాలేదు. దీనిపై లోక్‌సభ టీవీ సీఈఓ దర్యాప్తు చేస్తున్నారు’’ అని ఆ ప్రకటనలో పేర్కొంది. లోక్‌సభలో జరిగిన పరిణామాలను ఆసాంతం వీక్షించి, నివేదించేందుకు సభలోని ప్రెస్ గ్యాలరీలో మీడియా పూర్తిస్థాయిలో హాజరై ఉందని చెప్పింది. సభా కార్యక్రమాలన్నీ నమోదు చేయటం జరిగిందని, అవి ప్రజలకు అందుబాటులో ఉన్నాయని తెలిపింది.
కీలకమైన బిల్లుపై కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాల నిలిపివేత ప్రజా హక్కులను కాలరాయటమేనని అని విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. సాంకేతిక లోపం కారణంగా లోక్‌సభ టీవీ ప్రసారాలు నిలిచిపోయాయన్న వాదనను బీజేపీ నేత, ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ కొట్టిపారేశారు. ‘‘అది సాంకేతిక లోపం కాదు కానీ.. వ్యూహాత్మక లోపం’’ అని ఆమె మంగళవారం ట్విటర్ వెబ్‌సైట్‌లో చేసిన వ్యాఖ్యల్లో అభివర్ణించారు. ఈ అంశాన్ని తాను బుధవారం స్పీకర్ వద్ద లేవనెత్తుతానని చెప్పారు. అలాగే.. తెలంగాణ బిల్లుపై మంగళవారం తాను చేసిన ప్రసంగం ఆడియో, వీడియో రికార్డులను లోక్‌సభ సచివాలయం తనకు అందించటం లేదని కూడా సుష్మా తెలిపారు. లోక్‌సభ ప్రత్యక్ష ప్రసారాల నిలిపివేత తమకు తెలియకుండా జరిగిందని.. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. సభా కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేయటం సహించరానిదని జనతాదళ్ (యునెటైడ్) నేత శరద్‌యాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనికి నిరసనగా ఆయనతో పాటు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ దినేశ్‌త్రివేదీ కూడా లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు. ‘‘ప్రభుత్వం ఎందుకంత మొహం చాటేసింది? సభా కార్యక్రమాలను చూసే హక్కు, తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది’’ అని మజ్లిస్ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తప్పుపట్టారు.