
ఎస్సీ, ఎస్టీ సవరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన లోక్‌సభ
సాక్షి, న్యూఢిల్లీ : ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక సవరణ బిల్లును లోక్‌సభ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. బిల్లును సభ ముందుంచగా విపక్ష సభ్యులు ప్రతిపాదించిన సవరణలు ఓటింగ్‌లో వీగిపోయాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలను సభ ఆమోదించిన అనంతరం వాయిదా పడింది. అంతకుముందు బిల్లు ఆమోదం పొందేందుకు సహకరించిన సభ్యులకు మంత్రి తవర్ చంద్ గెహ్లాట్ ధన్యవాదాలు తెలిపారు.
ప్రభుత్వం దళితులు, వెనుకబడిన తరగతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రమోషన్లలో రిజర్వేషన్లను సుప్రీం కోర్టు ప్రశ్నించిన వెంటనే రిజర్వేషన్ కొనసాగేలా ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసిందని గుర్తు చేశారు. రివ్యూ పిటిషన్ దాఖలు చేసినందునే బిల్లును తేవడంలో జాప్యం జరిగిందని విపక్ష సభ్యులకు వివరించారు.
ఎస్సీ, ఎస్టీ చట్టం కింద దాఖలైన కేసుల పరిష్కారానికి రాష్ట్రాలు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తాయని, బాధితులకు ఎఫ్‌ఐఆర్ నమోదైన వారం రోజులకే పరిహారం అందేలా బిల్లులో నిబంధనలు పొందుపరిచామని చెప్పారు.