Assembly Elections 2019: Maharashtra, Haryana Assembly Elections Live Updates | మహారాష్ట్ర, హరియాణాలలో కొనసాగుతున్న పోలింగ్‌ - Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర, హరియాణాలలో ముగిసిన పోలింగ్‌

Published Mon, Oct 21 2019 7:59 AM | Last Updated on Mon, Oct 21 2019 8:03 PM

Maharashtra Haryana Assembly Elections 2019 Polling Update - Sakshi

ముంబై/చండీగఢ్‌ :  చెదురుమదురు ఘటనలు మినహా మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండు రాష్ట్రాల్లోనూ పోలింగ్ మందకొడిగానే సాగింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది. మహారాష్ట్రలోని 288, హరియాణాలోని 90 స్థానాలకు నేడు పోలింగ్‌ జరిగింది. సాయంత్రం 6 గంటల వరకు మహారాష్ట్రలో 55శాతం, హరియాణాలో62 శాతం పోలింగ్‌ నమోదైంది. అలాగే దేశవ్యాప్తంగా 51 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలకు కూడా నేడు ఉప ఎన్నికలు జరిగాయి. 

పోలింగ్‌ అప్‌డేట్స్‌ @ 5pm

  • మహారాష్ట్ర, హరియాణా లో పోలింగ్‌ మందకోడిగా సాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు మహారాష్ట్రలో 45 శాతం పోలింగ్‌ నమోదు కాగా, హరియాణాలో 55శాతం నమోదైంది. సాయంత్రం 6గంటలకు పోలింగ్‌ ముగియనున్నది. 

    బీజేపీ రికార్డు బద్దలు కొట్టబోతోంది
    మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ అత్యంత మెజార్టీతో గెలవబోతుందని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ధీమా వ్యక్తం చేశారు. 288 అసెంబ్లీ స్థానాలకు గాను 222 స్థానాల్లో బీజేపీ విజయం సాధించబోతుందని జోస్యం చెప్పారు. ‘ 220 స్థానాలు కాదు 222 స్థానాల్లో బీజేపీ జెండా ఎగరేయబోతుంది. గతంలో ఒక్కసారి కాంగ్రెస్‌ 222 స్థానాల్లో విజయం సాధించింది. ఈ రికార్డును ఈసారి బ్రేక్‌ చేయబోతున్నాం. మహారాష్ట్రలో బలమైన ప్రభుత్వాన్ని నిర్మించబోతున్నాం’  అని ప్రకాశ్‌ జవదేకర్‌ ధీమా వ్యక్తం చేశారు. 

పోలింగ్‌ అప్‌డేట్స్‌ 

  • సాయంత్రం 4 గంటల వరకు మహారాష్ట్రాలో 44 శాతం పోలింగ్‌ నమోదు కాగా, హరియాణాలో 51 శాతం పోలింగ్‌ నమోదైంది.
  • మహారాష్ట్రలో పోలింగ్‌ మండకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 38 శాతం పోలింగ్‌ మాత్రమే నమోదైంది. మహారాష్ట్రతో పోలిస్తే హరియాణాలో పోలింగ్‌ కొంచెం మెరుగ్గా ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు హరియాణాలో 48శాతం పోలింగ్‌ నమోదైందని ఈసీ వెల్లడించింది.

  •  అమితాబ్ బచ్చన్ తన భార్య జయ బచ్చన్, కుమారుడు అభిషేక్‌, కోడలు ఐశ్వర్యరాయ్‌ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముంబైలోని జుహు పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు. 

  •  బాలీవుడ్ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య గౌరితో కలిసి ముంబైలోని బంద్రావెస్ట్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 177లో ఓటు వేశారు. 

పోలింగ్‌ అప్‌డేట్స్‌

  • మహారాష్ట్రలో ఒంటి గంట వరకు 30.89 శాతం పోలింగ్‌ నమోదైంది. 
  • మహారాష్ట్రలోని రత్నాగిరి, భండారా జిల్లాలోని కొన్ని బూత్‌ల్లోని ఈవీఎంలలో లోపాలు తలెత్తడంతో  పోలింగ్‌ ఆలస్యమైంది. అలాగే ముంబైలోని వర్లీలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పోలింగ్‌ కొద్దిసేపు నిలిపివేశారు. ఈవీఎంల పనితీరుకు సంబంధించి కాంగ్రెస్‌ రాష్ట్ర యూనిట్‌ ఎన్నికల సంఘానికి 187 ఫిర్యాదులు చేసింది.

ఉత్సాహంగా ఓటేస్తున్న బాలీవుడ్‌ తారలు..
బాలీవుడ్‌ ప్రముఖులు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొంటున్నారు. హేమమాలిని, ఉర్మిళ మంటోడ్కర్‌, దీపికా పదుకొనే, షాహిద్‌ కపూర్‌, హృతిక్‌ రోషన్‌, ధర్మేంద్ర, అనిల్‌ కపూర్‌ వేర్వేరు పోలింగ్‌ బూత్‌ల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

  • మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్‌ తనయుడు, బాలీవుడ్‌ హీరో రితేష్‌ దేశ్‌ముఖ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన భార్య జెనీలియా, తల్లి వైశాలి దేశ్‌ముఖ్‌ కూడా ఓటు వేశారు. అనంతరం తన నివాసంలో.. తండ్రి చిత్ర పటం ముందు భార్య, తల్లితో కలిసి ఫొటో దిగారు.
  • మధ్యాహ్నం 12 గంటల వరకు హరియాణాలో 23.82 శాతం, మహారాష్ట్ర 17.01 శాతం పోలింగ్‌ నమోదైందని ఈసీ అంచనా వేసింది.

  • కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ముంబైలోని పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే స్మృతి పోలింగ్‌ చేరుకున్న సమయంలో ఓ ఆస్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ వృద్దుడు ఈ రోజు ఉదయం నుంచి స్మృతి కోసం పోలింగ్‌ బూత్‌ వద్ద ఎదురుచూస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె పోలింగ్‌ బూత్‌ వద్దకు రాగానే ఆయన్ను కలిసి.. అప్యాయంగా పలకరించారు.
  • ఉదయం 11 గంటల వరకు హరియాణాలో 23.12 శాతం, మహారాష్ట్రలో 16.34 శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఎన్నికల సంఘం అంచనా వేసింది.

  • ఎంఎన్‌ఎస్‌ చీఫ్‌ రాజ్‌ ఠాక్రే, ఆయన భార్య షర్మిల ఠాక్రేలు శివాజీ పార్క్‌లోని బాలమోహన్‌ విద్యామందిర్‌ పోలింగ్‌ బూత్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
  • శివసేన అధ్యక్షుడు ఉద్దవ్‌ ఠాక్రే, ఆయన సతీమణి రష్మీ, కుమారుడు ఆదిత్య ఠాక్రేలు బాంద్రా(తూర్పు)లో వారి నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, ఆదిత్య ఠాక్రే వర్లి నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు.

  • క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌‌, ఆయన సతీమణి అంజలి, కుమారుడు అర్జున్‌ బాంద్రా(పశ్చిమ) పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, ఆయన సతీమణి అమృత, తల్లి సరిత నాగ్‌పూర్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
  • మహారాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ బాలాసాహెబ్ థోరట్‌ కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 


పోలింగ్‌ బూత్‌కి సైకిల్‌పై సీఎం
హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ పోలింగ్‌ బూత్‌కి సైకిల్‌పై వచ్చారు. ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొనాలని కోరారు.

  • హరియాణాలో ఉదయం 10 గంటల వరకు 10.72 శాతం పోలింగ్‌ నమోదైంది.

  • ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మనవరాలు, అల్లుడితో కలిసి ఆయన పోలింగ్‌ బూత్‌కు వచ్చారు.



ఓటేసిన సినీ ప్రముఖులు..

సినీ ప్రముఖులు జెనీలియా, రితేష్‌ దేశ్‌ముఖ్‌, రవి కిషన్‌, కిరణ్‌రావ్‌, అమీర్‌ఖాన్‌, మాధురి దీక్షిత్‌లు వివిధ పోలింగ్‌ బూత్‌ల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

  • భారత మాజీ టెన్నిస్‌ ఆటగాడు మహేష్ భూపతి, అతని భార్య ప్రముఖ నటి లారా దత్తాలు ముంబైలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
  • ఉదయం 9 గంటల వరకు మహారాష్ట్రలో 5.29 శాతం, హరియాణాలో 6.07 శాతం పోలింగ్‌ నమోదైంది.
  • జేజేపీ నాయకుడు దుష్యంత్‌ చౌతాలా కుటుంబసభ్యులతో కలిసి  ట్రాక్టర్‌లో పోలింగ్‌ బూత్‌కు చేరుకున్నారు. సిర్సాలోని పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
  •  కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు రణ్‌దీప్‌ సుర్జేవాలా, ఆయన భార్య హరియాణాలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కైతాల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికల బరిలో ఉన్నారు.


గుడిలో పూజలు.. తాత ఆశీర్వాదం
ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగారు ఆదిత్య ఠాక్రే. వర్లి నియోజకవర్గం నుంచి శివసేన తరఫున బరిలో ఉన్న ఆయన.. పోలింగ్‌ సందర్భంగా సిద్ధివినాయక ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అలాగే తన తాత, శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రే ఆశీర్వాదం తీసుకున్నారు.

  • కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, ఆయన సతీమణి కాంచన్‌ గడ్కరీలు నాగ్‌పూర్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. గత ఐదేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిపై ప్రజలకు నమ్మకం ఉందన్నారు. బీజేపీ అన్ని రికార్డులను బ్రేక్‌ చేస్తోందని ధీమా వ్యక్తం చేశారు.

  • హర్యానాలోని అదంపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన టిక్‌టాక్‌ స్టార్‌ సోనాలీ ఫోగట్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

  • దాద్రి నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలో నిలిచిన రెజ్లర్‌ బబితా ఫొగాట్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.  

  •  ఒలంపిక్‌ పతక విజేత, స్టార్‌ రెజ్లర్‌ యోగేశ్వర్‌ దత్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన బరోడా నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలో ఉన్నారు.

  • ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సూలే బారామతిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తాను అభివృద్ధికి ఓటు వేసినట్టు తెలిపారు. కాగా, ఆ అసెంబ్లీ స్థానంలో ఎన్సీపీ తరఫున అజిత్‌ పవార్‌ పోటీ చేస్తున్నారు. 

  • ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ నాగ్‌పూర్‌లోని మహాల్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనాలని కోరారు. 

  • ఎన్సీపీ సీనియర్‌ నాయకులు అజిత్‌ పవార్‌ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన బారామతి అసెంబ్లీ స్థానం నుంచి ఆయన బరిలో ఉన్నారు. మరోసారి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాలని అజిత్‌ భావిస్తున్నారు. ప్రముఖ నటి శుభ ఖోటే అంధేరి పశ్చిమ నియోజకర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ప్రధాని సందేశం..

మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీలకు జరుగుతున్న పోలింగ్‌లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. అలాగే దేశంలోని పలు ప్రాంతాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. అన్ని చోట్ల రికార్డు స్థాయిలో పోలింగ్‌ నమోదు చేసి ప్రజాస్వామ్య పండగను సుసంపన్నం చేయాలని అన్నారు. యువత పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొంటుందని ఆశిస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

పోటీలో ఉన్న ప్రముఖులు..
మహారాష్ట్రలో: బీజేపీకి చెందిన సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ (నాగ్‌పూర్‌–నైరుతి),  కాంగ్రెస్‌ మాజీ ముఖ్యమంత్రులు అశోక్‌ చవాన్‌ (భోకర్‌), పృథ్వీరాజ్‌ చవాన్‌ (కరాడ్‌)  శివసేనకు చెందిన ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే (వర్లి)

హరియాణాలో: సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ (కర్నాల్‌), కాంగ్రెస్‌ మాజీ సీఎం భూపీందర్‌ సింగ్‌ హూడా (గర్హి సంప్లా–కిలోయి), రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలా (కైతాల్‌), కుల్దీప్‌ బిష్ణోయి (ఆదమ్‌పూర్‌), దుష్యంత్‌ చౌతాలా (ఉచన్‌కలాన్‌) 

ఉప ఎన్నికలు జరిగే రాష్ట్రాలు..
యూపీలో 11, గుజరాత్‌ 6, బిహార్‌ 5, అస్సాం 4, హిమాచల్‌ ప్రదేశ్‌ 2, తమిళనాడు 2, పంజాబ్‌ 4, కేరళ 5, సిక్కిం 3, రాజస్తాన్‌ 2, అరుణాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌గఢ్, పుదుచ్చేరి, మేఘాలయ, తెలంగాణల్లో ఒక్కోటి చొప్పున స్థానాలకు..మహారాష్ట్రలోని సతారా, బిహార్‌లోని సమస్తిపూర్‌ లోక్‌సభ స్థానాలకు కూడా సోమవారం ఉదయం పోలింగ్‌ ప్రారంభమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement