సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాజకీయ, రాజ్యాంగ సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా కేంద్ర నేర పరిశోధన సంస్థ (సీబీఐ) అధికారులు రాష్ట్ర పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ నివాసంపై దాడిచేసి ఆయన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించడం, పోలీసులు ఎదురు తిరిగి వారిని అదుపులోకి తీసుకోవడం, పర్యవసానంగా కేంద్రం పరిధిలోని సీఆర్‌పీఎఫ్ రంగ ప్రవేశం చేయడం రాజ్యాంగ సంక్షోభ పరిస్థితులను సూచిస్తుండగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రమేయంతోనే సీబీఐ అధికారులు నగర పోలీసు కమిషనర్ నివాసంపై దాడికి దిగారంటూ బెంగాల్ దీదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధర్నాకు దిగడం, ఒక్క సీపీఎం పార్టీ మినహా అన్ని బీజేపీ ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇవ్వడం రాజకీయ సంక్షోభ పరిస్థితులను తలపిస్తున్నాయి.
ఏ కేసు విషయంలోనైనా ఓ రాష్ట్రంలోకి సీబీఐ నేరుగా ప్రవేశించి దర్యాప్తు జరపడానికి, దాడులు నిర్వహించేందుకు వీల్లేదు. ఆలాంటి సందర్భాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ముందస్తు అనుమతి తప్పనిసరి. కోర్టు అనుమతి లేదా ఆదేశాలతో దాడులు చేయవచ్చు. ప్రతి కేసు విషయంలో సీబీఐ దర్యాప్తునకు రాష్ట్రాల ముందస్తు అనుమతి తలనొప్పి వ్యవహారం కనుక ఏడాదికోసారే సీబీఐ అన్ని కేసులకు సంబంధించి రాష్ట్రాల నుంచి ఒకేసారి అనుమతి తీసుకుంటుంది. అలా అనుమతి ఇవ్వడం కూడా రాష్ట్రాలకు పరిపాటే. అయితే గత నవంబర్ నెలలోనే అలా అనుమతి ఇచ్చేందుకు మమతా బెనర్జీ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ముందస్తు అనుమతి లేకుండా కోల్‌కతా పోలీసు కమిషనర్ నివాసంపై దాడులు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమే. ఈ దాడుల వెనక తమ ప్రమేయం లేదని, కోర్టు ఆదేశాల మేరకే సీబీఐ దాడులు నిర్వహించిందనీ మోదీ ప్రభుత్వం వాదిస్తోంది. (కోల్‌కతాలో ‘దీదీ’గిరి!)
ఇంతకు స్కామ్‌ల స్కీమ్‌లు ఏమిటీ?
శారదా చిట్ ఫండ్, రోజ్ వాలీ పోంజి స్కీముల కుంభకోణాల్లో మమతా బెనర్జీ, ఆమె అస్మదీయులకు సంబంధం ఉందన్నది ఆరోపణ. ఈ ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాధారాలను కనుమరుగు చేస్తున్నారన్న ఆరోపణలపై పోలీసు కమిషనర్‌పై సీబీఐ దాడులు జరిపింది. మమతా బెనర్జీపై ఆరోపణలు రావడానికి శారదా స్కీమ్‌కు చెందిన రెండు కార్యాలయాలను ఆమె స్వయంగా ప్రారంభించడం, ఆమె పార్టీకి చెందిన ఓ ఎంపీ శారదా చిట్ ఫండ్ కంపెనీ మీడియా డివిజన్‌కు అధిపతిగా ఉండడం కారణం. మమతా బెనర్జీ కార్యాలయాలను ప్రారంభించడం వల్లనే శారదా చిట్ ఫండ్ కంపెనీని ప్రజలు ఎక్కువగా నమ్మారు.
‘మీరు చెల్లించే ప్రతి వందరూపాయలకు యాభై శాతం అంటే, నూటికి 150 రూపాయలను ఏడాదికి చెల్లిస్తాం’ అంటూ శారదా కంపెనీ ప్రజల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసింది. ఏడాది తిరగ్గానే ముందుగా పెట్టుబడులు పెట్టిన వారికి, ఆ తర్వాత పెట్టుబడులు పెట్టిన వారి డబ్బును చెల్లిస్తూ వచ్చింది. ఆ తర్వాత పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోవడంతో ముందుగా పెట్టుబడి పెట్టిన వారికి డబ్బులు ఇవ్వలేక పోయింది. వెంటనే ఈ కంపెనీ కార్యకలాపాలను నిలిపేయాల్సిందిగా ‘సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా’ 2013లో ఆదేశాలు జారీ చేసింది. నాడు దేశవ్యాప్తంగా సంచలనం సష్టించిన ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది.
చిట్ ఫండ్ లాగే ప్రజల నుంచి పెట్టుబడులు వసూలు చేసిన ‘రోజ్ వాలీ’ బెంగాలీ సినిమాల్లో భారీగా పెట్టుబడులు పెట్టింది. ఐపీఎల్ లీగ్ క్రికెట్‌లో ‘కోల్‌కతా నైట్ రైడర్స్’కు స్పాన్సర్ చేసి నిండా మునిగింది. 2015లో చేతులు ఎత్తేసింది. శారదా చిట్ ఫండ్ నుంచి రుణాలు తీసుకున్న ‘ఈ సమయ్’ వార్తా పత్రిక ఎడిటర్ సుమన్ ఛటోపాధ్యాయ్‌ని గత డిసెంబర్ నెలలో సీబీఐ అరెస్ట్ చేసింది. ఇక రోజ్ వాలీ స్కామ్‌కు సంబంధించి, ఆ కంపెనీ నుంచి రుణం తీసుకున్న బెంగాలీ సినిమా నిర్మాత శ్రీకాంత్ మెహతాను జనవరి 24వ తేదీన సీబీఐ అరెస్ట్ చేసింది.
ఈ అరెస్ట్‌ల నేపథ్యంలో కోల్‌కతా పోలీసు కమిషనర్‌ను అరెస్ట్ చేయడానికి సీబీఐ అధికారులు వస్తున్నారని, అయితే ఆయన పరారీలో ఉన్నారని ‘ఇండియా టుడే’ శనివారం ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. ఆ మరునాడు ఆదివారం నాడే సీబీఐ అధికారులు కమిషనర్ నివాసంపై దాడి చేశారు. అయితే ఆయన ఎక్కడికి పారిపోకుండా తన నివాసంలోనే ఉన్నారు. యూపీలో మాయావతి, అఖిలేష్ యాదవ్‌లపై పాత కేసులను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సీబీఐ, ఈడీ సంస్థలు తిరగతోడడం, ఇప్పుడు కోల్‌కతాలో సీబీఐ దాడులు నిర్వహించడం తీవ్ర సంక్షోభ పరిస్థితులకు దారితీయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment