
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (ఫైల్‌ఫోటో)
సాక్షి, కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో నీట్ పరీక్ష నిర్వహణలో అవకతవకలపై తక్షణమే చర్యలు చేపట్టాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. నీట్ పరీక్షను తిరిగి నిర్వహించాలని ఆమె పట్టుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నీట్ పరీక్షను ఇకముందు సక్రమంగా నిర్వహించాలని కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రి ప్రకాష్ జవదేకర్‌కు మమతా బెనర్జీ లేఖ రాశారు.
పలు పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు సకాలంలో బెంగాలీ ప్రశ్నాపత్రాలను ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంగ్లీష్, హిందీ ప్రశ్నాపత్రాల ఆధారంగా సమాధానాలు రాయాలని విద్యార్థులపై పలుచోట్ల ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం ఉందని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో ఆమె పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడ్డ వారిపై తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు. అవసరమైతే ఆయా అభ్యర్థులకు సరైన అవకాశం ఇచ్చేందుకు తిరిగి పరీక్షను నిర్వహించాలని సూచించారు. విద్యార్థుల కెరీర్‌కు విఘాతం కలగకుండా పరీక్షలను సజావుగా నిర్వహించడంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.