
హెచ్‌ఆర్డీ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జాతీయ స్థాయిలో కీలక పరీక్షలుగా పేరొందిన నీట్, జేఈఈ, యూజీసీ నెట్, సీమ్యాట్‌లను ఇకపై ఏడాదికి రెండు సార్లు నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ శనివారం ప్రకటించారు. విద్యారంగంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ద్వారా పలు సంస్కరణలు తీసుకొస్తామని గతంలోనే కేంద్రం పేర్కొన్న విషయం తెలిసిందే.
ఇకపై ఈ పరీక్షలన్నింటిని సీబీఎస్‌ఈ స్థానంలో ఎన్టీఏ నిర్వహిస్తుందని జవదేకర్ పేర్కొన్నారు. ప్రతి ఏటా ఫిబ్రవరి, మే నెలల్లో నీట్, జనవరి, ఏప్రిల్ నెలల్లో జేఈఈ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు రెండు సార్లు నీట్ పరీక్షను రాస్తే వచ్చే బెస్ట్ స్కోర్‌ను అడ్మిషన్ల కోసం పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది విద్యార్థులకు లాభం చేకూరుతుంది. ఏడాదిలో ఒక ప్రయత్నంలో సీటు సాధించలేకపోయిన వారు వెంటనే మరో ప్రయత్నం చేయడం ద్వారా విజయం సాధించే అవకాశం కలుగుతుంది.