మోదీది తెలివితక్కువ నిర్ణయం
దేశాన్ని సర్వనాశనం చేశారు: రాహుల్
► ప్రధానిగా కొనసాగే హక్కు లేదు: మమత
న్యూఢిల్లీ/కోల్‌కతా: పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రధాని నరేంద్ర మోదీపై ప్రతిపక్ష నాయకులు రాహుల్‌గాంధీ, మమతాబెనర్జీ తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. మోదీది తెలివితక్కువ నిర్ణయమని, ఆయనొక్కడివల్ల దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తిందని ఆరోపించారు. దీన్ని నల్లధనం, అవినీతిపై ‘యజ్ఞం’గా ప్రధాని అభివర్ణించడాన్ని తప్పుపట్టారు. పెద్ద నోట్ల రద్దు ప్రకటించి నెల రోజులు గడిచినా ప్రజల కష్టాలకు అంతేలేక పోవడంతో విపక్ష పార్టీల నాయకులు గురువారం పార్లమెంటులో చేతికి నల్ల రిబ్బన్లు కట్టుకుని ‘బ్లాక్ డే’ను పాటించారు. కాంగ్రెస్‌తో పాటు తృణమూల్, సీపీఎం, సీపీఐ, జేడీయూ, సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు ఈ నిరసనలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మీడియాతో మాట్లాడుతూ... ‘ఇది సాహసోపేతం కాదు... తెలివితక్కువ నిర్ణయం. దేశాన్ని సర్వనాశనం చేసింది. రైతులు, మత్స్యకారులు, రోజువారీ కూలీలు, కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతోంది’ అని అన్నారు.
మోదీ ఓ నియంత
ప్రస్తుతం దేశంలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులకు మోదీనే బాధ్యత వహించాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ‘ఇది నియంత పాలన. మోదీకి ప్రధానిగా కొనసాగే నైతిక హక్కు లేదు. రాజీనామా చేయాలి. తప్పు చేసిన తరువాత కూడా ఆయన ఛాతీని చూపిస్తూ... జబ్బలు చరుస్తున్నారు. ఏమిటీ ఘోరం? ఇలాంటి పర్సనాలిటీ సినిమాలకు అవసరం. రావణాసురుడికి కూడా విశాల ఛాతీ ఉంది’ అని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క రూపాయి నల్ల ధనం కూడా బయటకు తీయలేని పెద్ద నోట్ల రద్దు విఫల నిర్ణయమని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు.
అది ‘నల్లధనం మద్దతు దినం’: వెంకయ్య
ప్రతిపక్షాలు నిరసన తెలపడాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తప్పుపట్టారు. ఇది ‘బ్లాక్ డే’కాదని... ‘నల్లధనానికి మద్దతు దినం’ అని వ్యాఖ్యానించారు.