ఇండోర్: కోరికలు తీరాలని దేవున్ని వేడుకునే వాళ్లను, కష్టాలు ఎదురైనపుడు తననే ఎందుకిలా చేస్తున్నాడని తిట్టుకునే వాళ్లని మనం చూస్తుంటాం. కానీ భార్య కాపురానికి రాలేదని దేవుడిని తిట్టడమే కాకుండా విగ్రహాన్ని ధ్వంసం చేసే మనిషిని చూశామా..! అయితే ఇలాంటి ఘటన ఇండోర్ లోని పాండ్లా ప్రాంతంలో చోటుచేసుకుంది. తన భార్య కాపురానికి రానందుకు ఆగ్రహించిన ఓ భర్త దేవుని విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. మనోజ్ బంజారా(37) తన భార్య గత కొంత కాలంగా కాపురానికి రావడం లేదని ఆగ్రహంతో ప్రాచీన దేవాలయంలోని మూల విరాట్ ను ధ్వంసం చేశాడని పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మనోజ్ మానసిక స్ధితి కొంత కాలంగా బాగాలేకపోవడంతో అతని భార్య పుట్టింటికి వెళ్లింది. అమెను కాపురానికి రప్పించడానికి బంజారా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరి ప్రయత్నంగా ఏదైనా అద్భుతం జరిపించి తన భార్యను కాపురానికి రప్పించాలని దేవుడిని వేడుకున్నాడట. అయినప్పటికీ తన భార్య తిరిగి రాక పోవడంతో ఆగ్రహించిన మనోజ్ శనివారం రాత్రి దేవుని విగ్రహాన్ని విగ్రహాన్ని ధ్వంసం చేశాడు.
దీంతో పాండ్లా ఏరియాలో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. పోలీసులు అదనపు బలగాలను మెహరించారు. మనోజ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసును నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. దీనిపై స్పందించిన ఆర్ఎస్ఎస్ నేత వినోద్ మిశ్రా దేవాలయానికి భద్రత కల్సించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. నిందితున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
భార్య కాపురానికి రావడం లేదని..
Published Sun, Jun 26 2016 7:48 PM | Last Updated on Mon, Sep 4 2017 3:28 AM
Advertisement
Advertisement