
తల్లీ కొడుకులను పొడిచి చంపేశాడు
న్యూఢిల్లీ: ఢిల్లీ పాలం ప్రాంతంలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. వ్యక్తిగత కక్షలతో తల్లీ కొడుకులను హత్యచేసిన ఓ వ్యక్తి, ఆ తర్వాత ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. అంజుదేవి, ఆమె కుమారుడు ప్రశాంత్ (16) లను ఆ కుటుంబానికి బాగా తెలిసిన శ్యామ్ సింగ్ (32) అనే వ్యక్తి దారుణంగా పొడిచి చంపాడు. అనంతరం గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. మధ్యాహ్నం 4 గంటల సమయంలో శ్యామ్ నేరుగా వంటింట్లో చొరబడ్డాడు. తెలిసినవాడు కావడంతో అక్కడే చదువుకుంటున్న ప్రశాంత్ అభ్యంతరం చెప్పలేదు. వంటింట్లోంచి కత్తి తెచ్చుకుని హఠాత్తుగా ప్రశాంత్ పై దాడిచేశాడు. మెడపై ఏడుసార్లు పొడిచాడు. పొరుగువారితో మాట్లాడుతున్న తల్లి.. తన కొడుకు అరుపులు విని పరుగెత్తుకొచ్చింది. కానీ అప్పటికే ప్రశాంత్ రక్తపు మడుగులో కొట్టుకుంటున్నాడు. ఆమె ఆ షాక్ లో ఉండగానే ఆమెపై కూడా దాడిచేసి 8 సార్లు పొట్టలో కత్తితో పొడిచాడు.
అనంతరం పారిపోవడానికి ప్రయత్నించాడు. ఈలోపు తల్లీబిడ్డల ఆర్తనాదాలు విన్న స్థానికులు ఇంటిముందు గుమిగూడారు. దీంతో అతను గొంతు కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించాడు. ప్రశాంత్ అక్కడికక్కడే చనిపోగా, అంజు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరణించింది.
అంజుదేవి భర్త రాంజీ చిరువ్యాపారి. ఈ దంపతుల కుమార్తె జైపూర్‌లో చదువుకుంటోంది. ఈ కుటుంబానికి శ్యామ్‌సింగ్ కుటుంబం బాగా సన్నిహితంగా మెలుగుతారు. ఇరు కుటుంబాలు బిహార్‌కు చెందినవారని పోలీసుల విచారలో తేలింది. హత్యకేసు నమోదు చేసిన పోలీసులు ఇరువైపులా బంధువులను ప్రశ్నిస్తున్నారు. వ్యక్తిగత కారణాల వల్లనే ఈ హత్యలకు పాల్పడ్డాడా అనే కోణంలో దర్యాప్తు మొదలు పెట్టామని పోలీసు ఉన్నతాధికారి దీపేంద్ర పాథక్ తెలిపారు.