
దాడి చేయబోతే.. పట్టుకుని చితక్కొట్టారు
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మాజీమంత్రి కపిల్ మిశ్రాపై దాడికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని ఆయన మద్దతుదారులు పట్టుకుని చితక్కొట్టారు. ఉత్తర ఢిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో తన ఇంటివద్దే కపిల్ మిశ్రా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. అంకిత్ భరద్వాజ్ అనే వ్యక్తి ఆయనపై దాడికి ప్రయత్నించగా మిశ్రా మద్దతుదారులు అతడిని పట్టుకుని కొట్టి, పోలీసులకు అప్పగించారు. తాను ఆప్ మద్దతుదారుడినని భరద్వాజ్ చెప్పగా, ఆప్ ప్రతినిధులు మాత్రం అతడు బీజేపీ మనిషని అన్నారు. కాసేపటికే ఈ ఘటనతో తమకు ఏమాత్రం సంబంధం లేదని బీజేపీ స్పష్టం చేసింది.
మిశ్రా ఉన్న గదిలోనే మీడియాతో మాట్లాడేందుకు భరద్వాజ్ ప్రయత్నిస్తుండగా అతడిని కార్యకర్తలు చుట్టుముట్టారు. జుట్టుపట్టుకుని లాగి, దుస్తులు చింపేశారు. నేలమీద పడేసి కొట్టారు. ఒక పోలీసు అతడిని కాపాడేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. తన మీద దాడి చేయబోతుంటే తన మద్దతుదారులు ఆపారని, వీళ్లెవరో తనకు తెలియదని కపిల్ మిశ్రా మీడియాతో అన్నారు. అయితే తన మద్దతుదారులకు మాత్రం ఎవరినీ కొట్టొద్దని స్పష్టంగా చెప్పానని చెప్పారు. ఆప్ నాయకులు సంజయ్ సింగ్, ఆశిష్ ఖైతాన్, సత్యేంద్రజైన్, రాఘవ్ ఛద్దా, దుర్గేష్ పాఠక్ తదితరుల విదేశీ పర్యటనల వివరాలు చెప్పాలంటూ బుధవారం ఉదయం నుంచి కపిల్ మిశ్రా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.