సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెద్దనోట్ల రద్దు అంశంపై తాజాగా మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త మన్మోహన్‌సింగ్ స్పందించారు. పెద్దనోట్ల రద్దు అనేది అనవసర సాహసమని, కొన్ని లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో మినహా ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి చర్యలు విజయవంతం కాలేదని పేర్కొన్నారు. తాజాగా ఆర్బీఐ వెల్లడించిన లెక్కలతో పెద్దనోట్ల రద్దుపై విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఆర్మీఐ మాజీ గవర్నర్ రఘురాజన్ సైతం తాను గవర్నర్‌గా ఉన్నప్పుడు ఈ చర్యను వ్యతిరేకించినట్టు తాజాగా వెల్లడించిన సంగతి తెలిసిందే.
'సాంకేతికంగాగానీ, ఆర్థికంగాగానీ ఇలాంటి సాహసం చేయాల్సిన అవసరముందని నాకు అనిపించడం లేదు. దేశంలోని 86 శాతం కరెన్సీని వ్యవస్థ నుంచి ఉపసంహరించుకుంటే.. అప్పుడు ఆర్థికవ్యవస్థ పడిపోయే అవకాశముంటుంది' అని మన్మోహన్ సింగ్ అన్నారు. మొహాలీలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఆయన ముచ్చటించారు.