
'షా'వంట మనిషి కోసం 'మాయ' గాలింపు
లక్నో: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దళితులతో కలిసి భోజనం చేసిన వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఆ కార్యక్రమంలో వంట చేసిన మనిషి దళితుడు కాదని, అగ్రకులస్తుడేనని, తద్వారా బీజేపీ తన దళిత వ్యతిరేకతను మరోసారి రుజువుచేసుకుందని బహుజన్ సమాజ్ పార్టీ ఆరోపిస్తోంది. నిజాలు నిగ్గుతేల్చేందుకు సదరు వంటమనిషి కోసం గాలించాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి పార్టీ శ్రేణులను ఆదేశించినట్లు తెలిసింది. (చదవండి: దళిత కుటుంబంతో అమిత్ షా భోజనం)
ఉత్తరప్రదేశ్ వారణాసి(ప్రధాని మోదీ నియోజకవర్గం)లోని జోగియాపూర్ లో జూన్ 1న ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బీజేపీ చీఫ్ అమిత్ షా దళితులతో కలిసి భోజనం చేసిన సంగతి తెలిసిందే. అయితే షాతోపాటు ఆ కార్యక్రమానికి 250 మంది బీజేపీ నేతలు తరలివచ్చారు. వారిలో 50 మంది మాత్రమే భోజనం చేశారని, ఎంపిక చేసిన ప్రదేశం.. వెనుకబడిన తరగతికి చెందిన బింద్ కులస్తుల ప్రాబల్యం ఉన్నదని, అలాంటప్పుడు దళితుల ఇళ్లలో భోజనం చేశామని ప్రచారం చేసుకోవడం ఏమేరకు సబబు? అని వారణాసి జోనల్ బీఎస్సీ నేత డాక్టర్ రామ్ కుమార్ కురేల్ విమర్శించారు. అతి త్వరలోనే వంటమనిషి జాడ తెలుస్తుందని, అప్పుడు అమిత్ షా ఆడిన నాటకం బయటపడుతుందని ఆయన అన్నారు. ఇక బీజేపీ నేతలు షా భోజనం వ్యవహరాన్ని రాజకీయం చేయడం దుర్మార్గమని మండిపడుతున్నారు.