సాక్షి, న్యూఢిల్లీ : దళిత మహిళ పోరాట పటిమకు సంకేతంగానే ఉత్తర్ ప్రదేశ్ అంతటా తన విగ్రహాలతో పాటు, బీఎస్పీ నేతల విగ్రహాలు ఏర్పాటు చేసినట్టు బీఎస్పీ అధినేత్రి మాయావతి మంగళవారం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మాయావతి సహా బీఎస్పీ నేతల విగ్రహాలను ప్రభుత్వ నిధులు రూ 2000 కోట్లు వెచ్చించి యూపీ అంతటా ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ 2009లో దాఖలైన పిటిషన్ విచారణలో భాగంగా మాయావతి అఫిడవిట్ దాఖలు చేశారు.
ఏ రాజకీయ పార్టీల అజెండాలను ముందుకు తీసుకువెళ్లే కార్యకలాపాల కోసం రాష్ట్ర బడ్జెట్ల నిధులను వాడరాదని పిటిషనర్ వ్యాఖ్యానించారు. కాగా, తన విగ్రహాలపై వెచ్చించిన ఖర్చును తిరిగి చెల్లించాలని సర్వోన్నత న్యాయస్ధానం మాయావతిని కోరిన నేపథ్యంలో ఆమె అఫిడవిట్‌ను దాఖలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో విస్తృతంగా చర్చించిన మీదట, అన్ని నిబంధనలు, బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగానే విగ్రహాలను ఏర్పాటు చేశామని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇతర రాజకీయ పార్టీలు సైతం ఆయా పార్టీల నేతల విగ్రహాలను ఏర్పాటు చేశాయని చెప్పుకొచ్చారు. పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది రాజకీయ దురుద్దేశంతోనే ఈ పనిచేశారని విగ్రహాల అంశం లేవనెత్తడంలో ఎలాంటి ప్రజా ప్రయోజనాలు లేవని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment