
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఓ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం మరోసారి వెలుగు చూసింది. దాదాపు 150 మందికి పైగా జూనియర్ విద్యార్థులు గుండు చేయించుకుని.. సీనియర్లకు సెల్యూట్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. సైఫాయ్ గ్రామంలోని ఉత్తర ప్రదేశ్ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజీలో ఈ దారుణం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియలో తెగ ప్రచారం అవుతున్నాయి. ఈ వీడియోలో 150 మంది వరకు ఫస్టియర్ విద్యార్థులు గుండు చేయించుకుని.. వరుసలో నడుస్తూ.. సీనియర్లకు భక్తితో నమస్కరిస్తున్నారు. ఆ సమయంలో ఓ సెక్యూరిటీ గార్డ్ అక్కడే ఉన్నాడు. కానీ అతడు దీన్ని ఆపడానికి ప్రయత్నించకపోవడం గమనార్హం.
దీని గురించి కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించగా.. ‘మా కళశాలలో ర్యాగింగ్‌ని నిషేధించి చాలా కాలమవుతుంది. కాలేజీలో ఇలాంటి చర్యలకు పాల్పడకుండా కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నాం. ఇందుకు కోసం ప్రత్యేకంగా ఓ అధికారిని కూడా నియమించాం. ప్రస్తుతం జరిగిన సంఘటన గురించి పూర్తిగా విచారణ జరుపుతాం. ఇందుకు బాధ్యులైన వారిమీద కఠిన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment