భోపాల్: మీటూ ఉద్యమం ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో)ని తాకింది. స్టేషన్ మధ్యప్రదేశ్ షాదోల్ రేడియో స్టేషన్‌లో తొమ్మిది మంది మహిళా క్యాజువల్ ఉద్యోగులు లైంగిక వేధింపుల గురించి ఫిర్యాదు చేశారు. సహాయక డైరెక్టర్ (ప్రోగ్రామింగ్) రత్నాకర్ భారతిపై లైంగిక వేధింపుల ఆరోపణలతో వీరు బహిరంగంగా వెలుగులోకి వచ్చారు. అయితే నిందితులపై చర్యలకు బదులుగా ఫిర్యాదు చేసిన మహిళలపై వేటు వేయడం తీవ్ర చర్చకు దారి తీసింది.
ఒకవైపు మీటూ ఉద్యమం దేశవ్యాప్తంగా ఉధృతవుతుండగా ఏఐఆర్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొమ్మది మంది క్యాజువల్ బ్రాడ్‌కాస్టర్స్ రత్నాకర్‌పై సంబంధిత ఏఐఆర్ అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఏఐఆర్ అంతర్గత విచారణ కమిటీ రత్నాకర్‌ను దోషిగా తేల్చింది. అయినప్పటికీ ఆయనపై ఎలాంటి చర్య తీసుకోలేదని ఉద్యోగ సంఘం ఆరోపించింది. పైగా ఆయనకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన తొమ్మిది మంది మహిళలపై వేటు వేయడం అన్యాయమని వాదించింది.
ధర‍్మశాల, ఓబ్రా, సాగర్, రాంపూర్,కురుక్షేత్ర, ఢిల్లీ స్టేషన్లలో కూడా లైంగిక ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఇక్కడ కూడా దాదాపు ఇలాంటి చర్యలే రిపీట్ అయ్యాయని ఏఆఐర్ ట్రేడ్ యూనియన్ వాదన. నేరస్తులకు చిన్నపాటి హెచ్చరిక చేసి వదిలేశారు. అలాగే క్యాజువల్ బ్రాడ్‌కాస్టర్స్‌ను రిజైన్ చేయమని కోరారని యూనియన్ నేతలు ఆరోపిస్తున్నారు.
మరోవైపు ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ జనరల్ ఫయాజ్ షెహ్రార్ ఈ ఆరోపణలను ఖండించారు. ప్రతి ఫిర్యాదును ఇంటర్ కంప్లైంట్స్ కమిటీ విచారించిందని తెలిపారు. ఈ క్రమంలో షాదోల్ ఫిర్యాదులను విచారించి రత్నాకర్‌ను బదిలీ చేశామని ఫయాజ్ చెప్పారు. ప్రస్తుతం ఆయన డీజీ ప్రధాన కార్యాలయానికి సంబంధించిన కఠినమైన నిఘా పరిశీలనలో ఉన్నట్టు చెప్పారు. అలాగే మహిళా ఉద్యోగుల తొలగింపునకు, లైంగిక వేధింపుల ఫిర్యాదులకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. వారి ఫెర్‌ఫామెన్స్ వార్షిక సమీక్ష ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు.
ఇది ఇలావుంటే ఈ వ్యవహారంపై స్పందించిన ఆల్ ఇండియా రేడియో ట్రేడ్ యూనియన్ మరో అడుగు ముందుకేసింది. షాదోల్‌తో పాటు ఇతర 6 స్టేషన్లలో వెల్లువెత్తిన లైంగిక వేధింపుల ఫిర్యాదుల ఆధారంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతోపాటు తొలగించిన మహిళా ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ ప్రసారభారతి సీఈవో శశిశేఖర్ వెంపటికి ఒక లేఖ రాసింది.
Comments
Please login to add a commentAdd a comment