
ప్రతీకాత్మక చిత్రం
హరిద్వార్ : లాక్డౌన్ వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్ల ద్వారా వారి వారి స్వస్థలాకు పంపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గుజరాత్‌లోని సూరత్ నుంచి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు వలస కార్మికులను తరలిస్తున్న ప్రత్యేక రైలు నుంచి 167 మంది ఆచూకీ లేకుండా పోయారు. దీంతో అధికారుల్లో కలవరం మొదలైంది. అధికారులు గణంకాల ప్రకారం 1,340 మంది వలస కార్మికులతో తో మే 12న సూరత్ నుంచి ప్రత్యేక రైలు బయలుదేరింది. అయితే రైలు హరిద్వార్‌కు చేరుకునే సమయానికి అందులో 1,173 మంది వలస కూలీలు మాత్రమే ఉన్నట్టు గుర్తించారు.(చదవండి : శ్రామిక్ రైళ్లలో స్వస్థలాలకు 10 లక్షల మంది కార్మికులు)
దీంతో అధికారులు అదృశ్యమైన వలస కార్మికులను గుర్తించే పనిలో పడ్డారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు అధికారులు చెప్పారు. వలస కార్మికుల సంఖ్యలో వ్యత్యాసానికి గల కారణాలను పరిశీలిస్తున్నట్ట చెప్పారు. ఈ మేరకు సూరత్‌లోని అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. కనిపించకుండా పోయిన వలస కార్మికులు రైలు బయలుదేరినప్పుడు అందులోనే ఉన్నారా, లేక మధ్యలో ఎక్కడైనా దిగిపోయారా అనే కోణాల్లో కూడా విచారణ చేపడతామని పేర్కొన్నారు.