పోలీసుల తుపాకులు లాక్కెళ్లిన ఉగ్రవాదులు
శ్రీనగర్: దక్షిణ కశ్మీర్‌లో ఉగ్రవాదులు తెగబడ్డారు. ఏకంగా కోర్టు ప్రాంగణంలోకి చొరబడి కాపలాగా ఉన్న పోలీసుల వద్ద నుంచి తుపాకులు ఎత్తుకెళ్లారు. మొత్తం ఆరు రైఫిల్స్ ఎత్తుకెళ్లినట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటన నేపథ్యంలో ఆదమరిచి ఉన్న పోలీసులపై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఇప్పటికే కశ్మీర్‌లో ఉగ్రవాదుల కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాజా ఘటన ఉలిక్కిపడేలా చేసింది. కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లా కోర్టు ప్రాంగణంలో కొంతమంది పోలీసులు గస్తీ కాస్తున్నారు. వారు విధులు ముగియడంతో తిరిగి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు.
అదే సమయంలో అనూహ్యంలో లోపలికి ప్రవేశించిన మిలిటెంట్లు వారి వద్ద నుంచి తుపాకులు ఎత్తుకెళ్లిపోయారు. ఈ క్రమంలో పోలీసులకు ఎలాంటి గాయాలు అవ్వలేదు. అంతకుముందు కుల్గాం జిల్లాలో కూడా ఇలాంటి దాడి చేసి నాలుగు తుపాకులు ఎత్తుకెళ్లారు. ఇదిలా ఉండగా.. జమ్ముకశ్మీర్ నియంత్రణ రేఖ వద్ద మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. హద్దు మీరిన పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి తుంగలోకి తొక్కి ఫైరింగ్ చేసింది. ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.