- బెంగళూరులో మంత్రుల మకాం
- దర్శనం లభించక చెన్నైకి తిరిగొచ్చిన వైనం
చెన్నై, సాక్షి ప్రతినిధి : ఆదాయూనికి మించి ఆస్తుల కేసులో బెంగళూరు జైలులో ఉన్న అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను దర్శించుకోవాలని, దుఃఖభారంలో కుంగిపోయి ఉన్న అమ్మను ఓదార్చాలని పదిరోజులుగా పడిగాపులు కాసిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు నిరాశ ఎదురైంది. అమ్మ దర్శనం లభించకపోడంతో వారు వెనుదిరిగారు. అన్నాడీఎంకేలో అంతా తానై ఏకచత్రాధిపత్యం సాగిస్తున్న అమ్మ జైలు పాలుకావడం పార్టీ శ్రేణులను తీవ్రంగా కుంగదీసింది. పార్టీ జయాపజయాలకు బాధ్యత వహిస్తూ ఏకైక ప్రజాకర్షణ నేతగా కొనసాగుతున్న జయ ప్రతిష్టపై తీరని మచ్చేపడింది.
నాలుగేళ్లు జయ జైలులోనే ఉంటే మరో ఏడాదిన్నర కాలంలో రాబోతున్న అసెంబ్లీ ఎన్నికలను ఎలా ఎదుర్కొవాలనే మీమాంశలో పడిపోయారు. అనేక అనుమానాలు, అవమానాలు, ఆవేదనలు మెదళ్లను తొలుస్తుండగా...అమ్మను జైలులో కలుసుకుని ఒకింత ఉపశమనం పొందాలని మంత్రులు ఆశించారు. అదేవిధంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఓ పన్నీర్‌సెల్వం పదవీ ప్రమాణం చేయగానే కొందరు మంత్రివర్గ సహచరులతో జైలుకు చేరుకున్నారు. రెండు రోజులు వేచిచూసినా అమ్మ అనుమతి లభించలేదు. బెయిల్ కోసం ప్రయత్నాలు సాగుతున్న సమయంలోనూ పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బెంగళూరులోనే తిష్టవేశారు.
ప్రతిరోజూ జైలు వద్దకు వెళ్లడం, వారిని కలుసుకునేందుకు అమ్మ నిరాకరించడం పరిపాటిగా మారింది. మంత్రులుగా, ప్రజాప్రతినిధులుగా తమ బాధ్యతలను విస్మరించి బెంగళూరులో ఉండిపోవడం అమ్మకు ఆగ్రహం తెప్పించినట్టు సమాచారం. మంత్రుల తీరుతో పార్టీకి అప్రతిష్టవాటిల్లుతుందని, రానున్న ఎన్నికలపై దీని ప్రభావం పడితే ఫలితాలు తారుమారవుతాయని శశికళ ద్వారా అమ్మ హెచ్చరించినట్లు సమాచారం. పార్టీవారంతా వెంటనే బెంగళూరు విడిచి పోవాలని అమ్మ ఆదేశించడంతో పది రోజుల క్రితం చెన్నై వదిలి వెళ్లిన వారంతా గురు, శుక్రవారాల్లో నగరానికి చే రుకున్నారు.
అమ్మకోసం 154 మంది మృతి
అమ్మ అంటూ తాము అభిమానంగా పిలుచుకునే జయలలిత జైలు పాలైందన్న ఆవేదనతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 154 మంది అశువులు బాసినట్లు అన్నాడీఎంకే రాష్ట్ర ప్రధాన కార్యాలయం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. 113 మంది గుండెపోటుతోనూ, 15 మంది ఉరివేసుకుని, 7 మంది విషం తాగి, ఒకరు బస్సు కిందపడి, 14 మంది కిరోసిన్ పోసుకుని, ఇద్దరు నీటి గుంటలో దూకి బలవన్మరణానికి పాల్పడినట్లు పేర్కొంది.
అమ్మను చూడాలని..
Published Sat, Oct 11 2014 2:15 AM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM
Advertisement
Advertisement