మీరెంతో ప్రత్యేకం
అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్‌కు ఎంత ముఖ్యమైన, ప్రత్యేకమైన అతిథో ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ ఆయనతో వ్యవహరించిన తీరు స్పష్టం చేసింది. విమానాశ్రయంలో ఆప్యాయంగా కౌగిలించుకుని ఆహ్వానం పలకడంలో కానీ.. హైదరాబాద్ హౌస్ లాన్‌లో ఒబామాకు స్వయంగా టీ తయారు చేసివ్వడం కానీ.. ఒబామాతో మోదీకున్న సాన్నిహిత్యాన్ని చాటిచెప్పాయి. మధ్యాహ్న భోజనం తరువాత హైదరాబాద్ హౌజ్ గార్డెన్‌లో అలా సరదాగా వ్యాహ్యాళికి వెళ్లి కబుర్లు చెప్పుకుంటూ ఒక దగ్గర కూర్చున్న సమయంలో ఒబామాకు మోదీనే స్వయంగా టీ కలిపిచ్చారు.
అంతకుముందు ప్రొటోకాల్‌ను కాదని విమానాశ్రయంలో ఒబామాకు మోదీ స్వయంగా స్వాగతం పలికారు. ఒబామా గత పర్యటనలోనూ నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రొటోకాల్‌ను పట్టించుకోకుండా స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి స్వాగతించారు. అగ్రరాజ్యాధీశుడికి భారత్ ఇచ్చే గౌరవానికి అద్దంపట్టే చర్యలివి. మోదీ అమెరికా పర్యటనలోనూ.. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్‌కు నివాళులర్పించేందుకు మోదీని ఒబామా స్వయంగా తోడ్కొని వెళ్లారు.