త్రుటిలో తప్పిన మరో ‘బియాస్’
జార్ఖండ్‌లో వెల్లువ మధ్య 8 గంటలు
సిమెంట్ దిమ్మెపెకైక్కి ప్రాణాలు కాపాడుకున్న 10 మంది పిల్లలు
డ్యామ్ గేటు ఎత్తివేయడంతో పెరిగిన నీటిమట్టం
బొకారో (జార్ఖండ్): హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదీ ప్రవాహంలో ఇటీవల 24 మంది తెలుగు విద్యార్థులు కొట్టుకుపోయిన సంఘటన లాంటిది జార్ఖండ్‌లో తృటిలో తప్పిపోయింది. జార్ఖండ్‌లోని దామోదర నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన 10 మంది బాలురు,.. డ్యామ్ గేటు ఎత్తివేయడంతో పెరిగిన ప్రవాహం మధ్య దాదాపు 8 గంటలకుపైగా చిక్కుకుపోయినా ఎట్టకేలకు ప్రాణాలు దక్కించుకున్నారు. వారు నదిలో ఉండగానే, ఎగువనున్న తేనూఘాట్ డ్యామ్ స్లూయిస్ గేట్ ఎత్తివేయడంతో అకస్మాత్తుగా నీరు వెల్లువెత్తింది. దీనితో వారంతా, ప్రాణభయంతో చంద్రాపురా థర్మల్ విద్యుత్కేంద్రానికి చెందిన ఎత్తై సిమెంట్ దిమ్మెపైకి చేరుకున్నారు. ప్రవాహంమధ్య సిమెంట్ దిమ్మెపైనే ఎనిమిది గంటలకుపైగా బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఆ తర్వాత వారిని పోలీసులు రక్షించారు. జార్ఖండ్‌లోని బొకారో జిల్లా పచౌరా గ్రామంవద్ద శుక్రవారం ఈ సంఘటన జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి 11-30 వరకూ (పోలీసులువచ్చి కాపాడేవరకూ) వారు ప్రవాహం మధ్యనే చిక్కుకుపోయారని, వారంతా 16ఏళ్లలోపు వయసువారేనని బొకారో డిప్యూటీ కమిషనర్ ఉమాశంకర్ సింగ్ తెలిపారు.
‘బియాస్’ నివేదికపై చర్యలు: వీర భద్ర సింగ్
సిమ్లా(హిమాచల్‌ప్రదేశ్): బియాస్ నదిలో తెలుగు విద్యార్థుల గల్లంతు దుర్ఘటనపై మండి డివిజనల్ కమిషనర్ సమర్పించిన దర్యాప్తు నివేదికను తదుపరి చర్యల కోసం ప్రధాన కార్యదర్శికి పంపినట్లు శనివారం హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ వెల్లడించారు. దర్యాప్తు నివేదికకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటామని, నదిలో గల్లంతైన అందరి మృతదే హాలు దొరికేదాకా అన్వేషణ కొనసాగుతుందని ఆయన తెలిపారు. జూన్ 8న బియాస్ నదిలో 24 మంది తెలుగు విద్యార్థులు, ఓ టూర్ ఆపరేటర్ మునిగిన ఘటనపై హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు మండి డివిజనల్ కమిషనర్ దర్యాప్తు నివేదిక సమర్పించారు. కాగా, ఇరాక్‌లో అపహరణకు గురైన హిమాచల్ వాసులను రక్షించేందుకు కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని వీరభద్రసింగ్ విలేకరులకు తెలిపారు.