ఎమ్మెల్యే డాక్టర్‌గా మారి.. ఆదుకున్నారు
మిజోరాం రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యే బుధవారం తన నియోజకవర్గానికి చెందిన మహిళకు స్వయంగా ఆపరేషన్ నిర్వహించారు.
మిజోరాం రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యే బుధవారం తన నియోజకవర్గానికి చెందిన మహిళకు స్వయంగా ఆపరేషన్ నిర్వహించారు. సైహా జిల్లా ఆసుపత్రిలోని సర్జన్ శిక్షణ కోసం ఇంఫాల్‌కు వెళ్లారని.. అదే సమయంలో ఓ మహిళ(35) తీవ్ర కడుపునొప్పితో అక్కడి వచ్చినట్లు తనకు తెలిసిందని ఎమ్మెల్యే డా. కే బిచ్‌హువా తెలిపారు. వెంటనే ఆసుపత్రికి చేరుకుని ఆమెకు ఆపరేషన్ నిర్వహించినట్లు చెప్పారు.
మహిళ కడుపులో చిన్న రంధ్రం ఏర్పడిందని ఆపరేషన్ జరిగి ఉండకపోతే ఆమె ప్రాణాలు కోల్పోయేదని తెలిపారు. గురువారం ఆమెను ఆసుపత్రిలో కలిసి పరామర్శించారు. జిల్లాలో వైద్యుల కొరత ఉందని జిల్లా అభివృద్ధి సమావేశంలో ఎమ్మెల్యే తమ దృష్టికి తీసుకువచ్చినట్లు డిప్యూటీ కమిషనర్ చెప్పారు. బిచ్‌హువా 2013లో సైహా నియోజకవర్గం నుంచి మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్‌ఎఫ్) తరఫున పోటీ చేసి గెలుపొందారు. 1991లో మెడికల్ డిగ్రీ పూర్తి చేసిన బిచ్‌హువా.. 20 ఏళ్ల పాటు వైద్యవృత్తిలో ఉన్నారు. ఆయన భార్య కూడా వైద్యురాలే. 2008లో తొలిసారి పోటీ చేసిన ఆయన ఓడిపోయారు.