ఎన్సీపీకి కేసర్కర్ టాటా
సాక్షి ముంబై: సావంత్‌వాడి ఎన్సీపీ ఎమ్మెల్యే దీపక్ కేసర్కర్ అందరు ఊహించినట్టుగానే ఆదివారం ఎన్సీపీకి రాజీనామా చేశారు. వచ్చే నెల శివసేనలో చేరనున్నట్టు ప్రకటించారు. దీపక్ కేసర్కర్ ఎన్సీపీని వీడి శివసేనలో చేరనున్నట్టు గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై మీడియాలోనూ అనేక కథనాలు వచ్చాయి. కేసర్కర్ ఈ పుకార్లను కొట్టిపడేసినప్పటికీ ఆదివారం ఎన్సీపీకి రాజీనామా చేసి శివసేనలో చేరనున్నట్టు ప్రకటించారు.
మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు సునీల్ తట్కరేతో భేటీ అయి, తన సమస్యలు, ఫిర్యాదులు వివరించారు. తట్కరే నుంచి సంతృప్తికరమైన సమాధానం లభించలేదు. మరో ఎనిమిది రోజుల్లో ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయనున్నట్టు పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకుడైన నారాయణ రాణే దాదాగిరికి వ్యతిరేకంగా దీపక్ ఇటీవల గళమెత్తిన సంగతి తెలిసింది. నీలేశ్ రాణేను ఓడించి, కొం కణ్‌లో గూండాయిజానికి తెరదించండి అంటూ మిత్రపక్షానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు.
రాణే కు ఎన్సీపీ మద్దతు ప్రకటించినప్పటికీ కేసర్కర్ మాత్రం ఆయనకు వ్యతిరేకంగా వ్యవహరించారు. అంతేగాక పార్టీ అధిష్టానంపై నిరసన వ్యక్తం చేశా రు. దీంతో ఆయన ఎన్సీపీని వీడనున్నట్టు వార్తలు రావడం ప్రారంభమయ్యాయి. నారాయణ రాణేపై అనేక ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ‘ఆయనకు పార్టీ మద్దతు ఇవ్వవద్దని చెప్పాను. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తాము నిర్ణయం తీసుకోలేమని సునీల్ తట్కరే స్పష్టం చేస్తూ, నన్ను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. అందుకే నేను పార్టీని వీడాల్సివచ్చింది. కేవలం సిందుధుర్గ్ జిల్లాలో మళ్లి ప్రజాసామ్యాన్ని నిలబెట్టేందుకు పార్టీని వీడుతున్నాను. పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్‌పై ఇప్పటికి నాకు గౌర వం ఉంది. ఇక శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేతో చర్చించాను. మా కార్యకర్తలతో చర్చించి తొందర్లనే శివసేనలో చేరుతాను’ అని కేసర్కర్ ప్రకటించారు. ఆయన నియామకంతో శివసేనకు కొంకణ్‌లో బల మైన నాయకుడు లభించినట్టయిందని చెప్పవచ్చు.
కేసర్కర్ బాటలోనే పలువురు మాజీలు
గతంలో సేనను వీడిన అనేక మంది తిరిగి శివసేన లో చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మా జీలకు ఆహ్వానం పలుకుతున్నామని ఠాక్రే సైతం ప్రకటించారు. త్వరగా శివసేనలో చేరాలని లేకుం టే, పార్టీ తలుపులు తొందర్లోనే మూసివేస్తామని ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఛగన్ భుజ్‌బల్, నారాయణరాణే వంటి మాజీలు తిరిగి శివసేనలో చేరనున్నట్టు ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలను భుజ్‌బల్, రాణేలు ఖండించినప్పటికీ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోపు రాష్ట్ర రాజకీయాల్లో పలుమార్పులు జరగనున్నట్టు తెలుస్తోంది. ఈసారి అసెంబ్లీల్లో విజయం సాధించగల గల శివసేనకు సత్తా తమకు ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రజాసామ్య కూటమి కూడా చీలిక దిశగా సాగుతోంది. అందుకే సేనలోకి ప్రవేశించాలనుకునేవారు త్వరగా రావాలని ఉద్ధవ్ ప్రకటనలు చేస్తున్నారు. అన్ని వివరాలను చూశాకే మాజీలను పార్టీలోకి తీసుకుంటామని చెప్పారు.