సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్ హయాంలో కర్ణాటక అవినీతిమయమైందని ప్రధాని మోదీ విమర్శించారు. రాష్ట్రంలో రోజుకో కుంభకోణం బయటపడుతోందన్నారు. సోమ వారం సాయంత్రం మైసూరులో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం మహరాజ కాలేజీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. తాను ఇటీవల బెంగళూరు సభలో సిద్దరామయ్య సర్కారును పది శాతం కమీషన్ల ప్రభుత్వమని విమర్శించానని, అయితే అది అంతకంటే ఎక్కువని తనకు తర్వాతే తెలిసిందన్నారు.
కర్ణాటక సంపదను, ప్రజాధనాన్ని దోచుకుంటూ రాష్ట్రానికి దరిద్రం పట్టించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. రాష్ట్రాభివృద్ధికి బీజేపీనే గెలిపించాలని కోరారు. ‘రాష్ట్రంలో రోజుకో కాంగ్రెస్ మంత్రులు, నేతలపై కొత్త కుంభకోణం, కొత్త అవినీతి ఆరోపణ బయటికొస్తున్నాయి. ప్రభుత్వ పథకాల్లోనూ అవినీతి నెలకొంది. రోజుకో కొత్త అబద్ధం చెబుతూ ప్రజలను మోసం చేసేందుకు రాష్ట్రసర్కారుప్రయత్నిస్తోంది’ అని విమర్శించారు.
ఈ సందర్భంగా బెంగళూరు–మైసూరు సిక్స్–లేన్ (117 కిలోమీటర్లు) హైవే ప్రాజెక్టుకోసం రూ.6,400 కోట్లను ప్రధాని ప్రకటించారు. మైసూరులో రూ.800 కోట్లతో ప్రపంచస్థాయి శాటిలైట్ రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మైసూరు–బెంగళూరు మధ్య విద్యుత్ రైల్వే లైనును జాతికి అంకితం చేశారు. తర్వాత మైసూరు–ఉదయ్‌పూర్ మధ్యన నడిచే ‘ప్యాలస్ క్వీన్ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించారు.
అదే భారత సమాజ బలం
ఎప్పటికప్పుడు కొత్త మార్పులకు అనుగుణంగా మార్పు చెందటమే భారత సమాజానికున్న గొప్పదనమని ప్రధాని తెలిపారు. శ్రావణబెళగొళలో మహామస్తకాభిషేక కార్యక్రమంలో పాల్గొన్న మోదీ.. గోమటేశ్వర బాహుబలి విగ్రహం (వింధ్యగిరి పర్వతం) సమీపంలో భారత పురాతత్వశాఖ నిర్మించిన 630 మెట్లను, అనంతరం 50 పడకల బాహుబలి ప్రభుత్వాసుపత్రిని ప్రారంభించారు.
ప్రధానికి రూమ్ దొరకటం కష్టమైంది!
మైసూరు పర్యటనలో ఉన్న మోదీ, అధికారులకు హోటల్‌లో అద్దెకు గదులు దొరకలేదు. దీంతో చివరి నిమిషంలో జిల్లా అధికారులు హుటాహుటిన మరో ఖరీదైన హోటల్ లో ప్రధాని, ఆయన బృందానికి బస ఏర్పాటుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment