
సాక్షి,హైదరాబాద్: జీఈఎస్ వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ కీలకోపన్యాసం చేశారు. ఈ సదస్సు సిలికాన్ వ్యాలీతో హైదరాబాద్‌ను కలపడమే కాదు భారత్ అమెరికా బంధాన్ని బలోపేతం చేస్తుందని చెప్పారు. మహిళలే ప్రథమం అన్న సదస్సు థీమ్ వినూత్నమైందన్నారు. అమెరికాతో కలిసి సదస్సును దక్షిణాసియాలో తొలిసారిగా నిర్వహించడం సంతోషకరమన్నారు. భారత పురాణాల ప్రకారం మహిళ ఒక శక్తి.. మహిళలు మనకు స్ఫూర్తి ఇస్తున్నారని కొనియాడారు. మానవజాతి అభివృద్ధి, ఎదుగుదలకు సంబంధించిన అన్ని రంగాలకు సంబంధించి సదస్సులో చర్చలు జరుగుతాయన్నారు.
సైనా నెహ్వాల్, పీవీ సింధు, సానియా మీర్జాలకు హైదరాబాద్ పుట్టిల్లు అని అభివర్ణించారు. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ వంటి భారత మహిళలు అంతరిక్ష ప్రయోగాల్లో కీలక పాత్ర పోషించారని ప్రస్తుతించారు. రాణీ అహల్యాబాయి, హోల్కర్, రాణి లక్ష్మిభాయి వంటి మహిళలు మనకు స్ఫూర్తినిస్తున్నారని అన్నారు.గుజురాత్‌లో లిజ్జత్ పాపడ్ వంటి సంస్థలను మహిళలే ముందుండి నడిపిస్తున్నారు...యోగాకు భారత్ మూలమైతే నేడు యావత్ ప్రపంచం యోగాను గుర్తిస్తోందన్నారు.
సున్నాను ఆవిష్కరించిన ఆర్యభట్ట భారతీయుడేనని, నేడు సున్నా మీదే డిజిటల్ ప్రపంచం నడుస్తున్నదన్నారు. చరక సంహింత ప్రపంచానికి ఆయుర్వేదాన్ని అందించిందన్నారు. కౌటిల్యుడు అర్థశాస్ర్తానికి ఆద్యుడని గుర్తుచేశారు. 21 రంగాల్లో విదేశీ పెట్టుబడులకు సంబంధించి పలు చట్టాలను భారత్ సవరించిందని చెప్పారు.
ప్రపంచ బ్యాంక్ రేటింగ్‌ల్లో 180 నుంచి 100వ స్ధానానికి వచ్చామన్నారు. దేశంలో 8 కోట్ల మంది చిన్నా, పెద్ద పారిశ్రామికవేత్తలున్నారని చెప్పారు. ముద్ర పథకం ద్వారా రూ 4.82 లక్షల కోట్ల రుణాలు ఇచ్చామని అన్నారు. సులభతర వాణిజ్యంలో భారత్ ర్యాంకు భారీగా మెరుగుపడిందని చెప్పుకొచ్చారు.
మెంటార్ ఇండవియా పథకం ద్వారా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తున్నామని చెప్పారు. ఇంక్యుబేషన్ సెంటర్ల ద్వారా స్టార్టప్‌లను ప్రోత్సహిస్తామనన్నారు. ఆధార్ ద్వారా ప్రస్తుతం కోట్లాది లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. జన్‌థన్ యోజన ద్వారా కోట్లాది మందికి బ్యాంకు ఖాతాలు సమకూరాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment