మోదీ చెప్పిన ఆ వీడియో 2014 నాటిది!
న్యూఢిల్లీ: నోట్ల రద్దును సమర్థిస్తూ, ప్రజలు నగదురహిత జీవనానికి త్వరలోనే అలవాటు పడ్తారంటూ ఓ బిక్షగాడి వాట్సాప్ వీడియోను.. శనివారం యూపీలోని మొరాదాబాద్‌లో ప్రసంగిస్తూ మోదీ ఉదహరించిన విషయం గుర్తుందా!? అది నోట్ల రద్దు నిర్ణయానికి చాలా రోజుల ముందు, 2014లో హైదరాబాద్ నుంచి అప్‌లోడ్ చేసిన వీడియోగా తేలింది. ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిన కారు వద్దకు వచ్చిన బిక్షగాడికి, కార్లో డ్రైవింగ్ సీట్లో కూర్చున్న మహిళ తన దగ్గర చిల్లర లేదనడం, ఆ బిక్షగాడు తన దగ్గర చిల్లర ఉందని చెప్పడంతో, తన దగ్గర నగదు లేదు కార్డు మాత్రమే ఉందంటూ ఆ మహిళ తన పర్స్ చూపడం ఆ వీడియోలో కనిపిస్తుంది.
దాంతో, ‘ఏం పర్లేదు.. నా దగ్గర స్వైపింగ్ మెషిన్ ఉంది’ అని ఆ బిక్షగాడు జవాబిస్తాడు. ఆ విషయాన్ని నమ్మని ఆ మహిళ ‘ఏదీ ఆ మెషిన్ చూపించాల’ంటూ అడుగుతుంది. దాంతో అతడు తన దగ్గర ఉన్న స్వైపింగ్ మెషిన్‌ను చూపించడంతో ఆ వీడియో ముగుస్తుంది. అరుుతే, ఆ యంత్రం పనిచేస్తున్నట్లు కానీ, కార్డును అందులో స్వైప్ చేసినట్లు కానీ ఆ వీడియోలో లేదు. అదీకాక, ఆ వీడియోను చూసినవారికి అది నిజంగా జరిగిన ఘటన కాదు.. కావాలనే రూపొందించిన వీడియోగా సులభంగా తెలిసిపోతుంది.