మాటలు కలిశాయి..!
కఠ్మాండు: చేతులు కలిశాయి.. నవ్వులు విరిశాయి.. పలకరింపులు తోడయ్యాయి.. సార్క్ వేదిక మురిసింది. సార్క్ సదస్సు ముగింపు సందర్భంగా గురువారం భారత ప్రధాని నరేంద్రమోదీ, పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌ల మధ్య జరిగిన ఆత్మీయ కరచాలన సన్నివేశం మొత్తం కార్యక్రమానికే హైలైట్‌గా నిలిచింది. బుధవారం నాటి అంటీముట్టని వైఖరికి భిన్నంగా.. సుదీర్ఘ షేక్‌హ్యాండ్‌తో, మధ్యమధ్య కాసేపు మాట్లాడుకుంటూ ఫొటోలకు ఫోజులిస్తూ.. వారిరువురు అందరి దృష్టిని ఆకర్షించారు. భారత్, పాక్‌ల మధ్య సానుకూల స్నేహసంబంధాలు సార్క్ దేశాలపై ఏ స్థాయిలో ప్రభావం చూపుతాయో సజీవంగా చూపేలా.. వారిద్దరి ఆత్మీయ పలకరింపులను ఇతర సభ్య దేశాధినేతలు, ప్రతినిధులు గట్టిగా హర్షధ్వానాలతో స్వాగతించారు.
వచ్చే సంవత్సరం సార్క్ సదస్సు పాకిస్తాన్‌లో జరగనున్న దృష్ట్యా.. ఈ ఏడాది సార్క్ సదస్సు ముగిసిన అనంతరం ‘ఓట్ ఆఫ్ థ్యాంక్స్’ చెప్పేందుకు షరీఫ్ వెళ్తున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు మిగతా నేతలతో పాటు మోదీ కూడా చప్పట్లతో అభినందించారు. బుధవారం సార్క్ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో షరీఫ్ ప్రసంగాన్ని పట్టించుకోకుండా మోదీ వార్తపత్రిక చదువుకుంటూ కూర్చున్న విషయం తెలిసిందే.
హిమాలయాల పాదాల వద్ద
సార్క్ సదస్సు ముగింపు సందర్భంగా కఠ్మాండూకు 30 కిమీల దూరంలోని ప్రఖ్యాత ధూలిఖేల్ రిసార్ట్‌లో నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాల సభ్య దేశాధినేతల కోసం విందును ఏర్పాటు చేశారు. ఈ రిసార్ట్‌ను పర్యాటకుల స్వర్గధామంగా భావిస్తారు. రిసార్ట్ వద్ద భారత ప్రధాని మోదీ మర్రి మొక్కను నాటారు.