ఆకాశంలో మరో అద్భుతం! | Moon Will Appear 14% Smaller in Size on Friday | Sakshi
Sakshi News home page

ఆకాశంలో మరో అద్భుతం!

Published Thu, Apr 21 2016 6:54 PM | Last Updated on Sun, Sep 3 2017 10:26 PM

Moon Will Appear 14% Smaller in Size on Friday

కోల్ కత్తాః  ఆకాశంలో మరో అద్భుతం జరగబోతోంది. పౌర్ణమినాడు అతి పెద్ద ఆకారంలో కనిపించే చంద్రబింబం.. కొంత పరిమాణం తగ్గి... ఈసారి  సూక్ష్మ రూపాన్ని సంతరించుకోనుంది. శుక్రవారం ఏప్రిల్ 22న వచ్చే పౌర్ణమినాడు కనిపించే నిండు చంద్రుడు ఎప్పుడూ కంటే చిన్న పరిమాణంలో కనిపిస్తాడని దాదాపు 15 ఏళ్ళ తర్వాత ఇటువంటి అరుదైన సన్నివేశం 'మినీ మూన్' ఆకాశంలో ఆవిర్భవించనుందని నిపుణులు చెప్తున్నారు.

ఇటీవలి కాలంలో గ్రహాలు భూమికి దగ్గరగా రావడం, ఎప్పుడూ కనిపించే కంటే చిన్న, పెద్ద సైజుల్లో మారుతుండటం అనేక సార్లు చూస్తున్నాం. అయితే ప్రతి పున్నమికీ నిండైన ఆకారంతో ఆకాశంలో ఆవిర్భవించే చంద్రవదనం.. ఈసారి దాని పరిమాణాన్ని తగ్గించుకుంటోందట. ప్రకృతి ప్రేమికులను అమితంగా ఆకట్టుకునే  చందమామ ఈ పున్నమినాడు 14 శాతం పరిమాణం తగ్గనున్నాడట. భూ కక్ష్యకు  సుమారు 4,06,350 కిలోమీటర్ల దూరంలోని ఓ బిందువువద్దకు చేరుకున్న చంద్రుడు సగటున భూమికి 3,84,000 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమౌతాడు.  దీంతో శుక్రవారంనాడు కనిపించే చంద్రుడు భూమినుంచి చివర స్థానంలోని బిందువుకు దగ్గరగా కనిపిస్తాడు. దీంతో ప్రతిసారి కనిపించే పౌర్ణమి చంద్రుడికన్నా ఈసారి చంద్రుడు చిన్నగా కనిపిస్తాడని కలకత్తాలోని ఎంపి బిర్లా ప్లానిటోరియం  డైరెక్టర్ దేవీప్రసాద్ దౌరి తెలిపారు.

అయితే శుక్రవారం ఉదయం 10.55 సమయంలో ఈ అద్భుతం సంభవించే అవకాశం ఉండటంతో చిన్న పరిమాణంలో ఉండే 'మినీ మూన్' ను జ్యోతిష్య శాస్త్రజ్ఞులు సహా చూడలేరని,  సూర్యకాంతి కారణంగా  జనానికి ఈ చిన్నపాటి చంద్రుడు కనిపించే అవకాశం లేదని దౌరి తెలిపారు. అయితే ఈ మినీ మూన్ రాత్రి సమయంలో కనిపించినప్పుడు మాత్రం ఓ పలుచని నీడ చాటున ఉన్నట్లుగా కనిపిస్తుందని చెప్పారు. ఇటువంటి మినీ మూన్ తిరిగి 2030 డిసెంబర్ 10 శుక్రవారం నాడు కనిపించే అవకాశం ఉందని వెల్లడించారు. చంద్రుడి రంగు ఇంటర్నెట్లో పుకార్లు వ్యాపిస్తున్నట్లుగా ఎటువంటి గులాబీ, ఆకుపచ్చ రంగులను కలిగి ఉండదని ఎప్పటిలాగే వెండిముత్యంలా ఉంటుందని దౌరి తెలిపారు. ఇదివరలో భూమికి దగ్గరగా వచ్చిన 'సూపర్ మూన్' కంటే ఈసారి చంద్రుడు 14 శాతం తక్కువ పరిమాణంలో ఉంటాడని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement