
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ భారత సైన్యంపై సంచలన ఆరోపణలు చేశారు. ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్‌లో హతమార్చిన తరువాత వారి శవాలను గుర్తించడానికి వీల్లేకుండా కెమికల్స్ ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. ఉగ్రవాది అయినా.. ఇంకెవరైనా.. మనిషిగా పుట్టిన ప్రతీ వ్యక్తికి చావు తర్వాత గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించాలని గుర్తుచేశారు. సాయుధ దళాలు ఎన్‌కౌంటర్స్ తర్వాత మృతదేహాలపై కెమికల్స్ ప్రయోగించి.. శవాలను గుర్తుపట్టకుండా చేయడం అమానవీయమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు.
దక్షిణ కశ్మీర్‌లోని శాంగస్ ప్రాంతంలో మెహబూబా ముఫ్తీ బుధవారం మీడియాతో మాట్లాడారు. నామరూపల్లేకుండా ముక్కలు ముక్కలైన సోదరుడి మృతదేహాన్ని చూసిన మరుక్షణం ఓ బాలుడి భావోద్వేగం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోవాలని మెహబూబా అన్నారు. అలాంటి సంఘటనలు చూసిన తర్వాత.. అతను తుపాకీ పట్టుకుంటే ఆశ్చర్యపోతారా? అని ప్రశ్నించారు. ముఫ్తీ వ్యాఖ్యలపై బీజేపీ నేత కవీందర్ గుప్తా స్పందించారు. వార్తల్లో నిలవడానికే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
ముఫ్తీ హయాంలోనే కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ఎక్కువగా జరిగిందన్నారు. సైన్యం కెమికల్స్ ఉపయోగించిందా? లేదా? అన్నది ఆమెకే తెలియాలని అన్నారు. ముఫ్తీ కామెంట్స్‌ను ఎలక్షన్ జిమ్మిక్‌గా వర్ణించారు. కాగా, కశ్మీర్‌లోని సాయుధ దళాలు కెమికల్ ప్రయోగిస్తున్నాయన్న ఆరోపణలు గతకొంత కాలంగా వినిపిస్తున్నాయి. సైన్యం మాత్రం ఆరోపణలను ఖండిస్తూనే ఉంది. జెనీవా ఒప్పందం ప్రకారం ఉగ్రవాదులపై సాయుధ దళాలు కెమికల్స్ ఉపయోగించడం నిషిద్ధం.
Comments
Please login to add a commentAdd a comment