
దంపతుల అరెస్టుకు రంగం సిద్ధం?
న్యూఢిల్లీ: నిధుల దుర్వినియోగం కేసుకు సంబంధించి సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, ఆమె భర్త జావేద్ ఆనంద్‌లను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. వీరి ముందస్తు బెయిల్ పిటిషన్ను ముంబై సీబీఐ కోర్టు శుక్రవారం తిరస్కరించింది. దీంతో ఆ దంపతులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మరోవైపు దీనిపై ముంబై హైకోర్టులో సవాల్ చేసేందుకు సెతల్వాద్ తరపు న్యాయవాదులు సిద్ధమవుతున్నారు.
2002 గుజరాత్ అల్లర్లలో నాశనమైన గుల్బర్గ్ సొసైటీలో బాధితుల స్మారకార్ధం మ్యూజియం ఏర్పాటుచేస్తామంటూ సేకరించిన నిధులను సొంతానికి వాడుకున్నారన్న కేసులో సెతల్వాద్ దంపతులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అధికారుల అనుమతి లేకుండా ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి విదేశీ నిధులను స్వీకరించారని ఆరోపిస్తూ గత వారం సీబీఐ సెతల్వాద్ ఇంటిపై దాడులు చేసింది. ఈ నిధులను ఆమె తన మద్యం కోసం, జుట్టు సింగారానికి వాడుకున్నారని ఆరోపించింది. అయితే సెతల్వాద్ దంపతులను బీజేపీ ప్రభుత్వం కావాలనే వేధిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రధాని నరేంద్రమోదీ కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారన్న విమర్శలు చెలరేగాయి. ఈ క్రమంలోవారి బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.