
నలంద (బిహార్) : బిహార్‌లో ఓ వ్యక్తిని చితకబాది, ఏకంగా బిల్డింగ్‌పై నుంచి తోసేశారు. ఓ వ్యక్తిని హత్య చేసి అనంతరం పారిపోవడానికి ప్రయత్నించాడని ఆరోపిస్తూ కొందరు వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటనలో హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనను అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడయో తీశాడు. కొందరు వ్యక్తులు సమూహంగా ఏర్పడి హత్య చేశాడని ఆరోపిస్తూ పోలీసుల ఎదుటే చితక్కొట్టి, వరండాపై నుంచి కిందకి తోసేశారు. ఈ వ్యవహారంలో తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హత్య చేసిన వ్యక్తి పారిపోతున్నాడని తెలిసి, పెద్ద ఎత్తున జనం గుమిగూడటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
చట్టాన్ని చేతులోకి తీసుకునే అధికారం ఎవరికీ లేదని మూకుమ్మడి దాడులను ఉద్దేశించి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా వ్యాఖ్యానించిన మరుసటి రోజే ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉందని దీపక్ మిశ్రా పేర్కొన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment