‘మైగవ్’లోకి 15 కోట్ల మంది!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మైగవ్’ ప్లాట్‌ఫాం ప్రజలకు ఎంతో చేరువవుతుందని, భవిష్యత్‌లో ఇందులో 15 కోట్ల మంది చేరే అవకాశం ఉందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ఈ వెబ్‌పోర్టల్‌ను ప్రారంభించి రెండు సంవత్సరాలు పూర్తై సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ‘డిజిటల్ ఇండియాలో మైగవ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పోర్టల్ ద్వారా కేంద్ర బడ్జెట్ నుంచి నెట్ న్యూట్రాలిటీ, స్మార్ట్ సిటీస్ తదితర అన్ని అంశాలపై సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉండటానికి, వారితో మమేకం అవడానికి ఇదొక ముందడుగు’ అని మంత్రి వివరించారు.
ప్రస్తుతం ఇందులో 35 లక్షల మంది చేరినట్లు తెలిపారు. మన దేశంలో మొబైల్ ఫోన్ యూజర్లు 103 కోట్ల మంది ఉన్నందున ‘మై గవ్’లో 10-15 కోట్ల మంది చేరటం పెద్ద కష్టమేమీ కాదన్నారు. సామాన్యలు సాధించిన విజయాలను ఈ పోర్టల్ ద్వారా అందరికీ తెలియజేయొచ్చని, టెక్నాలజీ సాయంతో భారత్ ముఖ చిత్రాన్ని మార్చొచ్చన్నారు. ఇదే మైగవ్ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు.