గిన్నిస్ ప్రపంచరికార్డు పత్రాలతో ప్రధాని మోదీ, సీఎం యోగి
అలహాబాద్/చిత్రకూట్: దేశ ప్రజలందరికీ లబ్ధి చేకూరేలా, న్యాయం జరిగేలా చూడడం ప్రభుత్వాల బాధ్యతని ప్రధాని మోదీ అన్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు సహాయపడే ఉపకరణాల పంపిణీ కార్యక్రమం సామాజిక న్యాయ శిబిరంలో శనివారం ప్రధాని పాల్గొన్నారు. అయిదేళ్లలో తమ ప్రభుత్వం దేశంలో వివిధ ప్రాంతాల్లో 9 వేల క్యాంప్‌లను నిర్వహించి, రూ.900 కోట్ల కంటే ఎక్కువ విలువ చేసే పరికరాలను పంపిణీ చేశామని వెల్లడించారు. యూపీఏ సర్కార్ చేసిన సాయంతో పోల్చి చూస్తే ఇది రెండున్నర రెట్లు ఎక్కువని అన్నారు.
మీ సహనమే మీకు రక్ష
నవ భారత నిర్మాణంలో దివ్యాంగులు కూడా భాగస్వాములు కావాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ పరికరాలన్నీ మీలో ఆత్మ విశ్వాసం నింపడానికి పనికి వస్తాయని, కానీ మీలో ఉండే సహనం, సామర్థ్యం, మానసిక వికా సం ఎప్పుడూ మీకు రక్షగా ఉంటాయని అవే మీకు బలమని మోదీ అన్నారు. దివ్యాంగులు, వృద్ధులకు ఎన్నో పథకాలు సుగమ్య భారత్ అభియాన్ పథకంలో భాగంగా విమానాశ్రయాల్లో, 700కి పైగా రైల్వే స్టేషన్లలో దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. రాష్ట్రీయ వయోశ్రీ యోజన పథకం కింద వయో వృద్ధుల్ని కూడా ఆదుకుంటున్నామన్నారు. దివ్యాంగులందరి కోసం ఉమ్మడిగా ఒక కొత్త సైన్ లాంగ్వేజీని తయారు చేసే పనిలో ఉన్నట్టు ప్రధాని వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో 2.50 కోట్ల మందికి పైగా దివ్యాంగులుంటే, 10 కోట్ల మందికి పైగా సీనియర్ సిటిజన్లు ఉన్నారు.
బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన
యూపీలో 296కి.మీ.ల బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేకు శంకుస్థాపన చేశారు. చిత్రకూట్, బాందా, హమీర్‌పూర్, జలాన్ జిల్లాల మీదుగా మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌ని కలుపుతూ ఈ ఎక్స్‌ప్రెస్‌వే సాగుతుంది. అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటైన బుందేల్‌ఖండ్‌లో ఈ ఎక్స్‌ప్రెస్ వేతో అభివృద్ధి జరిగి ప్రజల జీవనంలో అనూహ్యమైన మార్పులు వస్తాయని ప్రధాని అన్నారు.
గిన్నిస్ రికార్డుల్లోకి..
అలహాబాద్‌లో త్రివేణి సంగమం వద్ద పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన సామాజిక న్యాయ కార్యక్రమం గిన్నిస్ బుక్ రికార్డులకెక్కింది. ఈ మెగా క్యాంప్‌లో 56 వేలకు పైగా వివిధ రకాల ఉపకరణాలను ఉచితంగా పంపిణీ చేశారు. 26 వేల మంది లబ్ధిదారులు వాటిని అందుకున్నారు. హియరింగ్ ఎయిడ్‌లు, కృత్రిమ పాదాలు, బ్యాటరీతో నడిచే త్రిచక్ర వాహనాలు ఉన్నాయి. ఈ పరికరాలకే రూ.19 కోట్లకు పైగా ఖర్చు అయింది. మొత్తం మూడు రికార్డులను సొంతం చేసుకుంది. శుక్రవారం సాయంత్రం 1.8 కి.మీ. పొడవునా 300 మంది దివ్యాంగులు కూర్చున్న త్రిచక్ర వాహనాల పెరేడ్ గిన్నిస్ రికార్డుని సొంతం చేసుకుంది. ఒకే వేదికపై నుంచి భారీ స్థాయిలో పరికరాల పంపిణీ, ఆ తర్వాత వీల్ చైర్ల పెరేడ్ కూడా గిన్నిస్ రికార్డులకెక్కింది.
Comments
Please login to add a commentAdd a comment